ఉచిత పంటల బీమాను ఎత్తేసిన చంద్రబాబు
ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బీమా చేయించకపోగా కంపెనీలతో భారీ ప్రీమియాలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో అరటి రైతులు ఎకరాకు రూ.5 వేలు చెల్లించాల్సి రావడంతో, అంత మొత్తం కట్టలేక మెజార్టీ రైతులు వెనుకడుగు వేశారు. ఈ పరిస్థతుల్లో అర్నబ్ కారణంగా నష్టపోయిన పంటకు పరిహారం లభిస్తుందో, లేదోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో తమకు అందిన భరోసాతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. బీమా చేయించుకున్న కొద్దిమంది రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందే అవకాశం ఉన్నప్పటికీ, బీమా పరిధిలోకి రాని వేల మంది రైతుల పరిస్థితి ఏమిటన్నది ఆందోళన కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, నష్టపోయిన రైతులను గుర్తించి, తగిన పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.
తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు అరటి తోటలు కూలిపోవడంతో రైతులందరూ దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అలాగే పంట నష్టానికి అండగా నిలవాల్సిన బీమా భరోసా కూడా వారిలో చాలామంది లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తి వేయడంతో పాటు బీమా ప్రీమియం రూ.5 వేలు చేయడంతో ఆర్థిక ఇబ్బందులతో చాలామంది తీసుకోలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత పంటల బీమాను అమలు చేసి, రైతులందరికీ ఉచితంగా అందజేసి, కష్టకాలంలో వారికి భరోసా కల్పించారు.
ఫ చంద్రబాబు పాలనలో
అరటి రైతుల అవస్థలు
ఫ అరటి బీమా ప్రీమియాన్ని
రూ.5 వేలు చేసిన చంద్రబాబు
ఫ అంతకట్టలేక చాలామంది
రైతులు దూరం
ఫ ఇప్పుడు తుపానుకు 6,500 హెక్టార్లలో
నేలనంటిన తోటలు
ఫ ఏం చేయాలో తెలియక గగ్గోలు
ఫ గతం వైఎస్ జగన్ ప్రభుత్వంలో
ఉచిత పంటల బీమాతో రైతులకు మేలు
సాక్షి, రాజమహేంద్రవరం /చాగల్లు /పెరవలి: జిల్లాలో సుమారు 12,500 హెక్టార్లలో 20 వేల మంది రైతులు అరటిని సాగు చేస్తున్నారు. అర్నబ్ తుపాను కారణంగా దాదాపు 6,500 హెక్టార్లలో తోటలు నేలనంటాయి. అత్యధికంగా పెరవలి మండలంలో 4,500, ఇతర ప్రాంతాల్లో 2 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లింది. ఈ పంటకు బీమా రక్షణ కల్పించేందుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ప్రీమియం చెల్లించాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులతో సతమతమవుతున్న అన్నదాతలకు ఆ మొత్తం చెల్లించడం అదనపు భారంగా మారింది. దీంతో చాలా మంది బీమా చేయించుకోలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 800 హెక్టార్లకే బీమా చేయించినట్లు తెలుస్తోంది. అంటే సాగు విస్తీర్ణంతో పోలిస్తే బీమా రక్షణ పొందిన విస్తీర్ణం చాలా స్వల్పం.
తుపాను దెబ్బకు నేలపాలైన పంట
తుపాను ప్రభావంతో గత మంగళవారం సాయంత్రం నుంచి వీచిన భారీ ఈదురు గాలులు అరటి రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చే దశలో ఉన్న తోటలు గాలుల ధాటికి నేలకొరిగాయి. నెలల తరబడి శ్రమించి పెంచుకున్న తోటలు విరిగిపడటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే సాగు కోసం పెట్టిన పెట్టుబడులు చేతికందే పరిస్థితి లేకపోగా, ఇప్పుడు తోటలు నేలకూలడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
వైఎస్ జగన్ పాలనలో బీమా ఉచితం
ఈ పరిస్థితుల్లో అరటి రైతులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అమలైన ‘ఉచిత పంటల బీమా’ పథకం కింద రైతుపై పైసా భారం పడకుండా, మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరించేది. ఈ – క్రాప్‌లో నమోదు చేసుకుంటే చాలు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే నేరుగా పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది. అటువంటి వెసులుబాటును చంద్రబాబు రద్దు చేసేసి, నేడు ఎకరాకు రూ.5 వేల ప్రీమియం బాదుడు విధించడంతో అరటి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జగన్ పాలనలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్నప్పుడు అర్హతలు, బీమా నిబంధనల మేరకు పరిహారం అందే అవకాశం ఉండేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
12 ఎకరాల్లో తోట నేలమట్టం
12 ఎకరాలను కౌలుకు తీసుకుని అరటి తోట సాగు చేస్తున్నాను. ఎకరాకు రూ.60 వేల చొప్పున సుమారు రూ.7.20 లక్షలు పెట్టుబడి పెట్టాను. దీనికి అదనంగా ఎకరాకు రూ.40 వేల చొప్పున మొత్తం రూ.4.80 లక్షలు కౌలు చెల్లించాలి. మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని, పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. తుపాను నా పాలిట శాపంలా మారింది. 12 ఎకరాల్లోని అరటి తోట మొత్తం నేలవాలిపోయింది. పెట్టుబడి, కౌలు కలిపి రూ.12 లక్షల భారం ఉంది.
– నార్గాన్ని శివరామకృష్ణ, కౌలు రైతు, ఊనగట్ల
ఇప్పుడైనా పరిహారం అందించాలి
మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి తోట సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.60 వేల చొప్పున రూ.1.8 లక్షల పెట్టుబడి పెట్టాను. కౌలు ఎకరాకు రూ.50 వేల చొప్పున రూ.1.5 లక్షలు చెల్లించాలి. ఒక వారం రోజుల్లో అరటి గెలలు అమ్ముకోవచ్చనుకుంటే అర్నబ్ తుపాను ఒక్కరాత్రిలో పంటను నేలమట్టం చేసేసింది. గతంలోనూ పంట నష్టపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోలేదు. ఇప్పుడైనా అధికారులు అరటి తోటలు పరిశీలించి పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి.
– జుజ్జవరపు శ్రీనివాసు, కౌలు రైతు, చాగల్లు


