మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్
రాజమహేంద్రవరం సిటీ: తుపాను అనంతరం చేపట్టాల్సిన సహాయక, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ తుపాను సంభవించి రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోయారని, కనీసం తాగునీటిని కూడా అందించలేని దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సాధారణ జీవన పరిస్థితులకు చేరుకోలేకపోతున్నారన్నారు. విద్యుత్, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచి సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిన ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికలకే ప్రాధాన్యం ఇవ్వడం విచారకరం, సిగ్గుచేటు అన్నారు.
ఎన్నికల సామగ్రి
పంపిణీ కేంద్రాల మార్పు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో నిర్వహించనున్న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికలకు సంబంధించి భారీ వర్షాలు, మురసు తుపాను ప్రభావం దృష్ట్యా బిక్కవోలు, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను మార్పు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా గతంలో కేటాయించిన కేంద్రాల వద్ద నీరు నిలవడం, ఇతర అసౌకర్యాలు నెలకొనడంతో ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బిక్కవోలు మండలం ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాల స్థానంలో బిక్కవోలులోని సామర్లకోట – రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డులో ఉన్న శ్రీనివాసం గ్రాండ్‌ను పంపిణీ కేంద్రంగా మార్చారు. కపిలేశ్వరపురంలోని శ్రీసత్యరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థానంలో అంగర శ్రీసిద్ధార్థ జూనియర్ కళాశాలను, రాయవరం మెయిన్ రోడ్డులోని శ్రీరామయ్య జెడ్పీపీ ఉన్నత పాఠశాల స్థానంలో అదే మెయిన్ రోడ్డులోని శ్రీముళ్లపూడి బుజ్జిరాజు సూర్యనారాయణమ్మ ఫంక్షన్ హాల్‌ను పంపిణీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ సజావుగా జరిగేలా ప్రత్యామ్నాయ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
బెంగళూర్, చైన్నె
విమాన సర్వీసుల రద్దు
కోరుకొండ: రాజమహేంద్రవరం విమానాశ్రయానికి బుధవారం రావాల్సిన బెంగళూర్, చైన్నె సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 9 సర్వీసులు రాకపోకలు జరగాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక విమానాశ్రయానికి హైదరాబాద్, ముంబయి నుంచి 4 సర్వీసులు మాత్రమే నడిచాయి.
ప్రశాంతంగా మున్సిపల్
ఎన్నికల కౌంటింగ్
సాక్షి, రాజమహేంద్రవరం: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. తర్వాత పోలైన ఓట్లు లెక్కించారు. కొవ్వూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కంఠమని విజయలక్ష్మి (టీడీపీ), మండపేట చైర్మన్‌గా వేగుళ్ల అజయ్‌కుమార్ (టీడీపీ), నిడదవోలు చైర్‌పర్సన్‌గా మురాల జ్యోతి (జనసేన) గెలుపొందారు. నిడదవోలు మున్సిపాలిటీలో 32 వార్డులకు జనసేన 14, టీడీపీ 13, వైఎస్సార్ సీపీ 3, బీజేపీ 1, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మండపేటలో 36 వార్డులకు టీడీపీ 24, జనసేన 10, బీజేపీ 2 వార్డులు, కొవ్వూరులో 28 వార్డులకు 4 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 24లో టీడీపీ 15, జనసేన 6, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు.


