పుర భవితవ్యం.. బ్యాలెట్‌లో భద్రం | - | Sakshi
Sakshi News home page

పుర భవితవ్యం.. బ్యాలెట్‌లో భద్రం

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మూడు మున్సిపాలిటీల పరిధిలోని 96 వార్డులకు కొవ్వూరులో నాలుగు వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 92 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్‌ ద్వారా తేల్చారు. మొత్తం 1,08,597 మంది ఓటర్లకు 85,930 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 173 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం నుంచి ఓటింగ్‌ మందకొడిగా సాగింది. మధ్యాహ్నం తర్వాత కొంత ఊపందుకున్నా.. ఎక్కడా ఎన్నికల సందడి కనిపించలేదు. ఓటర్లు వచ్చి ఓటేసి వెళ్లిపోయారు. దీంతో మూడు పట్టణాల్లోనూ ఎన్నికల వాతావరణం పెద్దగా కనిపించలేదు.

అదృష్టం పరీక్షించుకున్న అభ్యర్థులు

● మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పీఠాలపై ప్రధాన పార్టీల నేతలు కన్నేశారు. మండపేట మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి ఏడుగురు పోటీ పడ్డారు. వైఎస్సార్‌ సీపీ తరఫున కాట్రవతు రాము, టీడీపీ నుంచి వేగుళ్ల అజయ్‌కుమార్‌ సహా మరో ఐదుగురు బరిలో నిలిచారు. ఇక్కడ 36 వార్డులకు 72 మంది పోటీపడ్డారు.

● నిడదవోలు చైర్మన్‌ గిరికి వైఎస్సార్‌ సీపీ తరఫున వేదాల విజయలక్ష్మి, జనసేన నుంచి మురాల జ్యోతితో పాటు మరో ఇద్దరు పోటీలో ఉన్నారు. 32 వార్డులకు 81 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

● కొవ్వూరు చైర్మన్‌ పీఠం కోసం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గండ్రోతు అంజలీదేవి, టీడీపీ అభ్యర్థి కంఠమనేని విజయలక్ష్మితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి పోటీ పడ్డారు. ఇక్కడ 28 వార్డులకు నాలుగు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 24 వార్డులకు 59 మంది పోటీ పడ్డారు.

స్ట్రాంగ్‌ రూమ్‌లలో అభ్యర్థుల భవితవ్యం

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్‌ రూమ్‌లలోకి చేరింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. దీనికోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. ఆయా మున్సిపాలిటీల్లోనే కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. కొవ్వూరులోని బ్యాలెట్‌ బాక్సులను దీప్తి స్కూల్‌లోని కౌంటింగ్‌ కేంద్రానికి తరలించారు. నిడదవోలులోని బ్యాలెట్‌ బాక్సులను ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రంలో భద్రపరిచారు. మండపేటలోని బ్యాలెట్‌ బాక్సులను పట్టణంలోని అన్నపూర్ణ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రానికి తరలించారు.

మీడియాకు అడ్డంకులు

ఎన్నికల వేళ మీడియాపై ఆంక్షలు చర్చనీయాంశంగా మారాయి. సమాచార, పౌర సంబంధాల శాఖ జారీ చేసిన మీడియా పాస్‌లు ఉన్నప్పటికీ జర్నలిస్టులను పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల సమాచారాన్ని సేకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు ఎదురైన ఈ పరిస్థితిపై జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫోన్లు తీసుకొచ్చిన ఓటర్లకు అవస్థలు

పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఈ నిబంధన తెలియక ఫోన్లతో వచ్చిన వారు వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియక సతమతమయ్యారు. కొందరు ఫోన్లను తిరిగి ఇంటికి తీసుకెళ్లి పెట్టి వచ్చి ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫోన్ల భద్రతకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిశోర్‌ పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు కొనసాగించారు. మొత్తంగా మూడు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది.

మున్సిపాలిటీ: నిడదవోలు

మున్సిపాలిటీ: మండపేట

పోలింగ్‌ సరళి ఇలా..

మున్సిపాలిటీ ఉదయం 9 ఉదయం 11 ఒంటి గంట మూడు గంటలకు ముగింపు

కొవ్వూరు 6.23 28.79 43.8 55.21 68.43

నిడదవోలు 3.17 27.46 43.63 56.06 69.3

మండపేట 14.84 34.39 50.43 63.24 77.54

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్‌

చైర్మన్ల, కౌన్సిలర్ల భవితవ్యాన్ని తేల్చిన ఓటర్లు

1,08,597 మంది ఓటర్లకు

85,930 మంది వినియోగం

జిల్లాలో మొత్తం 71.75 శాతం

ఓటింగ్‌ శాతం నమోదు

ఉదయం మందకొడి..

మధ్యాహ్నం కొంతఊపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement