రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో దివ్యాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే సదరం వైద్య పరీక్షలకు సంబంధించి సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.కోమల ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సదరం వైద్య పరీక్షల ద్వారా దివ్యాంగుల వైకల్య శాతాన్ని సంబంధిత వైద్య నిపుణులు నిర్ధారించి, నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారన్నారు. సదరం పరీక్షలు చేయించుకోవాలనుకునే దివ్యాంగులు తమకు సమీపంలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలను సంప్రదించి స్లాట్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా వాట్సాప్‌లో మనమిత్ర సేవతో పాటు ఆంధ్రప్రదేశ్ పౌరసేవ పోర్టల్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో స్లాట్లను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు వివరించారు. దీనివల్ల దివ్యాంగులు తమకు అనుకూలమైన మార్గంలో స్లాట్ నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సదరం సర్టిఫికెట్ అవసరమైన దివ్యాంగులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరికలు
రాజానగరం: వైఎస్సార్ సీపీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టతతో పాటు స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. మండలంలోని పాతతుంగపాడుకు చెందిన బోయిడి ఏడుకొండలుతోపాటు పలువురు జనసేన కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలను వేసి రాజా స్వాగతం పలికారు. అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని శ్రేణులకు సూచించారు.
తుపాను పంట నష్టాలపై కేంద్ర బృందం పరిశీలన
కాజులూరు: అర్నబ్ తుపాను ప్రభావంతో జరిగిన పంట నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం ఆదివారం కాజులూరు మండలంలో పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కమిషనర్ (ఎక్స్‌టెన్షన్) ప్రశాంత్ అర్మోరికర్, కేంద్ర వ్యవసాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గార్గ్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రణయ్‌గార్గ్ ఈ బృందంలో ఉన్నారు. వీరితో పాటు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా వ్యవసాయ, ఆర్థిక గణాంక అధికారులు వీటీ రామారావు, పి.త్రినాథ్, తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్, మండల వ్యవసాయాధికారి వి.అశోక్ తదితరులు మండలంలోని వివిధ గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ఈ తుపాను వలన 10 రోజుల్లో చేతికందాల్సిన పంట కళ్ల ముందే నాశనమైందని, కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. తుపాను పంట నష్టాలను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వ్యవసాయ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.


