చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

● పులివెందుల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు

● ఓటమి భయంతోనే దౌర్జన్యాలు, దాడులు

● మండిపడిన మాజీ హోం మంత్రి వనిత

ద్వారకాతిరుమల: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం సీఎం చంద్రబాబుకు కొత్తేమీ కాదని మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత విమర్శించారు. పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆదివారం ద్వారకాతిరుమలలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలసి నిరసన తెలిపారు. మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. పులివెందులలో టీడీపీ వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడటంపై తీవ్రంగా స్పందించారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న ఆయనకు నైతిక విలువలు, ప్రజాస్వామ్యబద్ధమైన విజయం పట్టడం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల నాలుగు నెలలు గడిచినా ప్రజలకు చేసిన మేలు ఏమీలేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి తమ పాలన గురించి చెప్పుకోలేని పరిస్థితిలో కూటమి నేతలు ఉన్నారని ఆరోపించారు. అందుకే దొడ్డిదారిన గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌ సీపీ బలంగా ఉందనడానికి కూటమి నేతల వ్యవహారశైలే నిదర్శనమని అన్నారు. కూటమి పాలనలో నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు జీవనం సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను సైతం ప్రజలకు అందించడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఓటమి భయంతోనే కూటమి నేతలు కుట్రలకు తెరతీస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారని వనిత ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ ప్రతాపనేని వాసు, పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్‌, పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, ఇమ్మడి నాగు, అచ్యుత ఏసుబాబు, పొనమాల ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, రుద్ర శివాజీ, చిలుకూరి చంద్రం, ఉక్కుర్తి వెంకట్రావు, పొంగులేటి రమేష్‌, బొండాడ సాత్యకిరావు, మానుకొండ కన్నయ్య, పానకాలు, దూలపల్లి ప్రసాద్‌, పొంగులేటి నాగేశ్వరరావు, భోగరాజు సాయికృష్ణ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement