మళ్లీ చంద్రబాబు కుట్ర కనిపించింది.. స్థానిక ఎన్నికల వేళ అది బహిర్గతమైంది.. కొత్త పింఛన్లు అంటూ సరిగ్గా రెండు నెలల కిందట హైడ్రామా చేసినా, అది ఎన్నికల స్టంటే అర్థమైపోయింది.. రెండున్నరేళ్లుగా ఇవ్వని కొత్త పింఛన్లను ఎన్నికల వేళ ఇస్తామని ప్రకటించారు.. ఇది తెలియని అర్హులు అనేకమంది సరిగ్గా రెండు నెలల కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం అసలు డ్రామా అందరికీ అర్థమైపోయింది.
సాక్షి, రాజమహేంద్రవరం: దరఖాస్తు చేసుకున్నాం.. ఈ నెల పింఛన్ వచ్చేస్తుంది.. కుటుంబానికి ఆర్థిక భరోసా దక్కుతుందని ఆశగా ఎదురు చూసిన అర్హులకు మళ్లీ చంద్రబాబు షాక్ ఇచ్చారు. కొత్త పింఛన్లు అక్టోబర్‌లో ఇవ్వడం లేదని చెప్పేయడంతో కోటి ఆశలతో నిరీక్షించిన వారికి నిరాశే ఎదురైంది. పోనీ నవంబరులోనైనా ఇస్తారనుకుంటే ఆ దరఖాస్తులు ఇప్పుడు ఎక్కడున్నాయో చెప్పే వారేలేరు. మొత్తంగా చూస్తే అధికారంలోకి వచ్చిన 27 నెలల తర్వాత పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం ఓ వింత అయితే... రెండు నెలలు గడిచినా దరఖాస్తుదారులకు పింఛన్లు మంజూరు చేయకపోవడం మరో విశేషం. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల హామీలను పూర్తిగా గాలికొదిలేసిన విషయం తెలిసిందే. దీంతో ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం చంద్రబాబు చేయించిన సర్వేల్లోనూ తేటతెల్లమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పడవ నిలువునా మునిగిపోయేలా ఉందని భావించిన చంద్రబాబు సెప్టెంబర్‌లో పింఛన్ల డ్రామాకు తెరతీశారు. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకుని, ఓటర్ల దృష్టి మళ్లించేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. అధికారం చేపట్టిన తర్వాత 27 నెలల్లో ఒక్కరికీ కొత్త పింఛన్ ఇవ్వని చంద్రబాబు ఎన్నికల భయంతోనే పింఛన్లు అంటున్నాడని, దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఎవరికీ మేలు చేయరని అప్పుడే అందరూ అనుమానించారు. ఆ అనుమానాలే గత రెండు నెలలుగా నిజమవుతున్నాయి.
దరఖాస్తుకూ సమయమివ్వకుండా..
కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మధ్యలో సెలవు రోజులు మినహాయిస్తే అర్హులకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం 9 రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి ప్రాథమిక పరిశీలన, 22 నుంచి 24 వరకు క్షేత్రస్థాయి పరిశీలన, తదుపరి అర్హత నిర్ధారణ ప్రక్రియ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో 55,766 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఇకనైనా నెలనెలా కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని భావించారు. అక్టోబర్ 1 నుంచే కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పడంతో కుటుంబానికి ఆసరాగా ఉంటుందని, మందుల ఖర్చులకు ఉపయోగపడతాయని ఆశించామని... ఇప్పుడేమో చంద్రబాబు మొండిచేయి చూపారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. నవంబర్ 1 నుంచి కూడా పింఛన్లు ఇవ్వడం లేదని వాపోతున్నారు.
జిల్లాలో దరఖాస్తుల వివరాలు
మండలం దరఖాస్తులు
రాజమహేంద్రవరం అర్బన్ 7,244
రాజమహేంద్రవరం రూరల్ 4,940
ఉండ్రాజవరం 2,163
దేవరపల్లి 2,176
కడియం 2,299
సీతానగరం 2,226
కోరుకొండ 2,278
నల్లజర్ల 2,109
మండపేట 3,827
నిడదవోలు 2,739
అనపర్తి 1,886
కొవ్వూరు 2,859
గోపాలపురం 1,630
కపిలేశ్వరపురం 1,995
చాగల్లు 1,616 పెరవలి 2,010
బిక్కవోలు 1,807
రాయవరం 1,872
రాజానగరం 3,327
తాళ్లపూడి 1,366
రంగంపేట 1,529
గోకవరం 1,868
ఎన్నికల వేళ చంద్రబాబు ఎత్తుగడ
కొత్త పింఛన్లు అంటూ హైడ్రామా
జిల్లాలో 55,766 మంది దరఖాస్తు
రెండు నెలలైనా అర్హులకు నిరాశే
ఒక్క పింఛనూ మంజూరు కాని వైనం
నిబంధనల కొర్రీ
ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనల కొర్రీతో తిరస్కరణలు ఎక్కువయ్యాయి. నానా అవస్థలు పడి దరఖాస్తు చేసుకున్నామని, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించినప్పటికీ చిన్న కారణాలతో దరఖాస్తులను పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకునేందుకు పది రోజులే అవకాశమివ్వడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవడం, ఆన్‌లైన్ ప్రక్రియ, ఈ–కేవైసీ, ఇతర వివరాల సమర్పణలో ఇబ్బందులు ఎదురయ్యాయని వాపోయారు. ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు నిర్ణీత వ్యవధిలో దరఖాస్తు పూర్తి చేయడం కష్టంగా మారడంతో వారంతా కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు క్యూ కట్టినా వారికి భరోసా దక్కలేదు. మరోవైపు వేర్వేరు కారణాలతో ఇప్పటికే 20 వేలకుపైగా దరఖాస్తులు తిరస్కరించారని విశ్వసనీయ సమాచారం.


