కూటమి ‘పథకం’ ప్రకారమే మోసం చేస్తోంది.. ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గద్దెనెక్కాక విస్మరిస్తోంది.. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను చాలావరకు పక్కనపెట్టింది. చెప్పిన మాటకు కట్టుబడకపోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు నింపింది. చంద్రబాబు బూటకపు హామీలు నమ్మి నిలువునా మోసపోయామని, ప్రస్తుతం స్థానిక ఎన్నికల వేళ ఓటుతో బుద్ధి చెబుతామని మహిళలు, నిరుద్యోగులు, బీసీలు, అన్నదాతలు ముక్తకంఠంతో చెబుతున్నారు. –సాక్షి, రాజమహేంద్రవరం
‘ఆడబిడ్డ నిధి’కి శఠగోపం
ఎన్నికల వేళ బాబు ఏం చెప్పారంటే...
నీకు రూ.1,500.., నీకు రూ.1,500.. ఇంట్లో ఎంత మంది మహిళలుంటే అందరికీ నెలకు రూ.1,500 చెల్లిస్తాం. ఆడబిడ్డ నిధి పేరిట పథకం అమలు చేసి అందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తాం.
ఎన్నికలయ్యాక ఏం చేశారంటే...
నాడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీ నేస్తం, కాపు నేస్తం పేరిట ఆర్థిక సాయం అందుకున్న మహిళల్లో చాలా మంది చంద్రబాబు మాయమాటలు నమ్మి కూటమి అభ్యర్థులకు ఓట్లేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినప్పటికీ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఫలితంగా తూర్పు గోదావరి జిల్లాలోని 2.3 లక్షల మంది మహిళలు ఈ పథకం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరందరికీ నెలకు రూ.1,500 చొప్పున ఇప్పటి వరకూ రూ.42 వేలకు పైగా కూటమి ప్రభుత్వం బాకీ ఉంది. అయినప్పటికీ చంద్రబాబు అండ్ కో ఆ పథకం విషయాన్నే ప్రస్తావించడం లేదు.


