దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు 16వ నంబరు జాతీయ రహదారిపై నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లజర్లకు చెందిన యలమాటి తులసమ్మ (70) మండలంలోని ముసుళ్లకుంట గ్రామంలోని తన ద్వితీయ కుమార్తె ఇంటి వద్ద ఉంటుంది. ఉదయం పుల్లలపాడులోని ఆమె బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వస్తూ పుల్లపాడు బస్టాండ్ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా, రాజమహేంద్రవరం వైపు నుంచి ఏలూరు వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తులసమ్మ తలకు బలమైన గాయం కావడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆంజనేయబాబు తెలిపారు.


