సెల్‌ రేగిన ఎన్నికల వేడి | - | Sakshi
Sakshi News home page

సెల్‌ రేగిన ఎన్నికల వేడి

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

ఫ ఊపందుకున్న అభ్యర్థుల ప్రచారం

ఫ రాజకీయ పార్టీల దూకుడు!

ఫ సోషల్‌ మీడియానే ప్రధాన ప్రచార అస్త్రం

ఫ వీడియోలు, రీల్స్‌, బ్యానర్లతో

ఓటర్లకు చేరువ

ఫ మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో సరికొత్త ప్రచార పంథా

సాక్షి, రాజమహేంద్రవరం: ఎన్నికల బరిలో అభ్యర్థులు, చేతిలో స్మార్ట్‌ ఫోన్లు, సోషల్‌ మీడియాలో ప్రచార హోరు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ విధానమే కనిపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారానికి తెర లేచింది. ఎన్నికలకు గడువు తక్కువగా ఉండటంతో అభ్యర్థులు సంప్రదాయ ప్రచారంతో పాటు డిజిటల్‌ ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీడియోలు, షార్ట్స్‌, ఆకర్షణీయమైన బ్యానర్లు, వాట్సాప్‌ సందేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రచార హడావుడి ఇప్పుడు వీధులకే పరిమితం కాకుండా, ఓటర్ల చేతుల్లోని ఫోన్లలోకి చేరింది.

షార్ట్స్‌తో యువత, జెన్‌జీకి గురి

గతంలో ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, సమావేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు వాటికి డిజిటల్‌ ప్రచారం తోడైంది. అభ్యర్థుల ప్రసంగాలు, స్థానిక సమస్యలపై వివరణలు, ప్రచార కార్యక్రమాల దృశ్యాలను చిన్న వీడియోలుగా రూపొందించి వైరల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. యువతను, ముఖ్యంగా కొత్తగా ఓట్లు పొందిన జెన్‌జీని ఆకట్టుకునేలా షార్ట్స్‌, ఆకర్షణీయమైన రీల్స్‌ రూపంలో ప్రచారాన్ని సాగిస్తున్నారు. అభ్యర్థుల అనుచరులు సైతం తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ప్రచారాన్ని విస్తరిస్తున్నారు.

ప్రతి వార్డు, గ్రామంలో ఓటర్లను నేరుగా కలవడం సమయం, ఖర్చుతో కూడుకున్న పని. డిజిటల్‌ వేదికల ద్వారా ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజలకు సందేశాన్ని చేరవేయవచ్చన్న అంచనాతో అభ్యర్థులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు తమ ప్రచారానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు సోషల్‌ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే డిజిటల్‌ ప్రచారం ఓట్లుగా ఎంతమేర మారుతుందన్నది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. మొత్తానికి మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల ప్రచారంలో డిజిటల్‌ వేదికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రచార గడువు పరిమితంగా ఉండటంతో అభ్యర్థులంతా అందుబాటులో ఉన్న ప్రతి వేదికనూ వినియోగించుకుంటున్నారు. ఒకప్పుడు గోడలపై పోస్టర్లు, ఇప్పుడు ఫోన్లలో వీడియోలు! ఎన్నికల ప్రచార తీరు మారుతున్నా.. ఓటరు మనసు గెలుచుకోవాలన్న లక్ష్యం మాత్రం మారలేదు.

స్మార్ట్‌ ఫోన్‌ తెరిస్తే ప్రచార పర్వమే

ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. నవంబర్‌ 1న మున్సిపల్‌ ఎన్నికలు, 5న పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పుర, పరిషత్‌ పోరుకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో తమకు అనుకూలంగా రూపొందించిన వీడియోలు, పరిచయాలు, హామీలు, స్థానిక సమస్యలపై సందేశాలను సోషల్‌ మీడియా వేదికలపై అభ్యర్థుల విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి వేదికల ద్వారా ఓటర్లకు చేరువవుతున్నారు. ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌, చిన్న వీడియోలతో తమ గుర్తింపు, ఎన్నికల గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరువ కావాలన్నదే ఈ డిజిటల్‌ దూకుడు వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement