ప్రాణహాని ఉంది.. కాపాడండి సారూ.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణహాని ఉంది.. కాపాడండి సారూ..

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

కాట్రేనికోన: తనకు ప్రాణహాని ఉందని, కాపాడాలంటూ మండలంలోని బలుసుతిప్ప గ్రామానికి చెందిన కోలా సరస్వతి రిజిస్టర్‌ పోస్టు ద్వారా పోలీస్‌ అథారిటీకి ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం.. సరస్వతి బలుసుతిప్పలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన స్థలంలో ఇల్లు కట్టుకుని 30 ఏళ్లుగా నివసిస్తోంది. ఆమె ఇంటి వద్ద లేని సమయంలో మల్లాడి వీరబాబు, ఆయన కుటుంబ సభ్యులు తన గుడిసెను తొలగించి నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు. ముమ్మిడివరం సివిల్‌ కోర్టులో ఈ స్థలం విషయమై వివాదం నడుస్తుండటంతో బాధితురాలు అక్కడ బోర్డు ఏర్పాటు చేయగా, ప్రత్యర్థులైన మల్లాడి దుర్గమ్మ, వీరబాబు, భాగ్యలక్ష్మి, నామాడి గంగమ్మలు కరల్రతో దాడి చేసి, గుండెలపై తన్ని, వస్త్రాలను చించేసి, అడ్డువచ్చిన ఆమె భర్తను కొట్టి గోదావరిలో పడేస్తామని బెదిరించారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో గుడిసెను తొలగించడమే కాకుండా పక్కా భవనం నిర్మాణం చేపడుతున్నా నిందితులకు పోలీసులు అండగా ఉన్నారని ఆరోపించింది.

దీనిపై ఈ నెల 16న స్థానిక కాట్రేనికోన పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, పెమ్మాడి వెంకటేశ్వరరావు అనే రాజకీయ నాయకుడి ఒత్తిడితో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై కాట్రేనికోన ఎస్సై దుర్గా శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, ప్రాథమిక విచారణ చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement