సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలా త్రిపుర సుందరీ సమేత కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉత్సవాలకు సంబంధించిన ముహూర్తపు రాట వేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి నుంచి ఆలయంలో కార్తిక మాస ఉత్సవాలకు సంబంధించిన పనులు మొదలు పెడతారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు, ఆలయ పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, అళ్లకి రాజ్‌గోపాల్, సన్నిధిరాజు వెంకన్న, చెరుకూరి రాంబాబు, శ్రీకాకుళపు సత్యనారాయణమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
రికార్డుల్లేని
30 వాహనాల సీజ్
కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధి చైతన్య నగర్ కాలనీలో దక్షిణ మండలం డీఎస్పీ శివప్రియ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జరిపిన కార్డెన్ సెర్చ్‌లో ఎటువంటి రికార్డులు లేని 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డ్రోన్, ఫేస్ ట్రాకర్, ఫింగర్ ప్రింట్ డివైజెస్‌ను కూడా వినియోగించారు. ఈ సెర్చ్‌లో కడియం, ధవళేశ్వరం, టూటౌన్ ఇన్‌స్పెక్టర్లు ఏ.వెంకటేశ్వరరావు, టి.గణేష్, శ్యాంసుందర్, ఎస్సైలు బి.దుర్గాప్రసాద్, పీడీఎల్ ప్రసన్న, సిబ్బంది పాల్గొన్నారు.
పాము కాటుకు రైతు మృతి
ఐ.పోలవరం: మండలంలోని జి.వేమవరం గ్రామానికి చెందిన బొండా రామాంజనేయులు (47) పాము కాటుతో మృతి చెందాడు. రోజూ మాదిరిగానే ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి పురుగు మందు పిచికారీ చేస్తుండగా, పక్కన ఉన్న పాము కాటు వేసింది. గమనించిన ఆంజనేయులు కేకలు వేయగా తోటి రైతులు పక్కనే ఉన్న టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఉరి వేసుకుని యువకుడి మృతి
రాజమహేంద్రవరం రూరల్: ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన సంఘటన శాటిలైట్ సిటీ సీ బ్లాక్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ ప్రాంతానికి చెందిన పెద్దిరెడ్డి మణికంఠ (20) టైల్స్ పనిచేస్తుంటాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. అనంతరం నిద్రించడానికి అదే ప్రాంతంలో ఉండే తల్లి దేవి సోదరి తెల్లమేకల అక్కమ్మ ఇంటికి వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో అక్కమ్మ నిద్ర లేచి చూడగా మణికంఠ ఇంటిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. తల్లి దేవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా బొమ్మూరు ఎస్సై కేవీ నాగార్జున కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రాజానగరం: ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ ఆదివారం తెలిపారు. ఈ నెల 19న జాతీయ రహదారిపై సూర్యారావుపేట జంక్షన్‌లో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని స్థానికులు చూసి, 108లో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడన్నారు. ఈ మేరకు వీఆర్వో దొండపాటి సత్యానందం ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.


