మేయర్‌ పీఠముడి! | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ పీఠముడి!

Oct 23 2026 12:15 AM | Updated on Oct 23 2026 12:15 AM

● కార్పొరేషన్‌ ఎన్నికలకు

ముందు కొత్త వివాదం

● కొత్తగా కలిసిన 11 గ్రామ పంచాయతీలు

● పాత జనాభా లెక్కలతో మేయర్‌

రిజర్వేషన్‌ ఖరారుపై అభ్యంతరం

రాజమహేంద్రవరం రూరల్‌: రాజమహేంద్రవరం కా ర్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి సరికొత్త వివాదం నెలకొంది. నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనకు సంబంధించి గెజిట్‌ రాకముందే మేయర్‌ రిజర్వేషన్‌ ఎలా ఖరారు చేస్తారని 11 విలీన గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనాభా లెక్కలు మారినప్పుడు పాత లెక్కలతో రిజర్వేషన్లు ఎలా రూపొందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ అడ్డగోలు ప్రక్రియను సవాలు చేస్తూ కొత్తగా విలీనమైన గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం పంపారు.

ముందే విడుదల

రాష్ట్రంలోని 17 నగర పాలక సంస్థలకు మేయర్‌ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ 2026 అక్టోబర్‌ 12న జీవో విడుదల చేశారు. ఆ ప్రకారం రాజమహేంద్రవరం మేయర్‌ పీఠాన్ని ఎస్సీ జనరల్‌ విభాగానికి కేటాయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 112 గ్రామ పంచాయతీలను సమీప పట్టణ, స్థానిక సంస్థల్లో విలీనం చేస్తూ, మండల ప్రజా పరిషత్తుల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే 2026 అక్టోబర్‌ 13న జీవో ఎంఎస్‌ నంబర్‌ 155ను జారీ చేశారు.

మారిన భౌగోళిక స్వరూపం

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 11 గ్రామ పంచాయతీలను కలుపుతూ మొత్తం 72 డివిజన్లుగా పునర్విభజన చేస్తూ తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ 2026 అక్టోబర్‌ 17న విడుదలైంది. గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించిన కీలక ఉత్తర్వులు, వార్డుల పునర్విభజన తుది గెజిట్‌ రావడానికి ఐదు రోజుల ముందే మేయర్‌ రిజర్వేషన్‌ ఎలా ఖరారు చేస్తారని విలీన గ్రామాల ప్రజలు నిలదీస్తున్నారు. తొర్రేడు, వెంకట నగరం, కాతేరు, పిడింగొయ్యి, హుకుంపేట, బొమ్మూరు, రాజవోలు, ధవళేశ్వరం, శాటిలైట్‌ సిటీ, వేమగిరి గ్రామాల విలీనంతో కార్పొరేషన్‌ జనాభా, భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది.

చట్టబద్ధత కోసమే..

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్టం 1994లోని సెక్షన్‌ 14–ఏ, 1995 రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం మేయర్‌ పదవి రిజర్వేషన్‌ అనేది ఆ కార్పొరేషన్‌ పరిధిలోని మొత్తం జనాభా, ఆయా సామాజిక వర్గాల నిష్పత్తి, రొటేషన్‌ పద్ధతి ఆధారంగా జరగాలి. మరి కొత్తగా విలీనమైన గ్రామాల జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా, వార్డుల సరిహద్దులు అధికారికంగా ఖరారు కాకుండా అక్టోబర్‌ 12నే మేయర్‌ రిజర్వేషన్‌ ఎలా ప్రకటిస్తారని విలీన గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శాటిలైట్‌ సిటీ మాజీ సర్పంచ్‌ రుంకాని రమణమ్మతో పాటు, పది విలీన గ్రామాలకు చెందిన పలువురు పౌరులు తమ ఆధార్‌ నంబర్లు, ఫోన్‌ నంబర్లు, సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అక్టోబర్‌ 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌కు, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కమిషనర్‌కు పంపించారు. తమ పోరాటం ఏ ఒ క్క సామాజిక వర్గానికో, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లకో వ్యతిరేకం కాదని గ్రామస్తులు తమ వినతిపత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం చట్టబద్ధత, పారదర్శకత, విస్తరించిన కార్పొరేషన్‌ జనాభాకు అనుగుణంగా న్యాయమైన రీతిలో రిజర్వేషన్ల పునఃపరిశీలన జరగాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement