● నిబంధనలు పక్కాగా అమలు చేయాలి
● వ్యయ పరిశీలకుడు నరేందిరన్
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను పారదర్శకంగా పర్యవేక్షించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితులను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఎన్నికల వ్యయ పరిశీలకుడు జీజీ నరేందిరన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో గురువారం అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, నిఘా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి బృందాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి రోజువారీ ఎన్నికల ఖర్చులను తప్పనిసరిగా వ్యయ రిజిస్టర్‌లో నమోదు చేయాలని, సంబంధిత అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ ఆ వివరాలను పరిశీలించి సంతకం చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలోనే అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితులు, వ్యయ రిజిస్టర్ నిర్వహణపై మార్గదర్శకాలు అందేలా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచార సభలు, రోడ్‌షోలు, మైకులు, ఫ్లెక్సీలు, వాహనాలు, ఇంధనం, డ్రైవర్ల వేతనాలు, డ్రోన్ కెమెరాలు, వీడియోగ్రఫీ తదితర ఖర్చులను కలెక్టర్ ఆమోదించిన ధరల పట్టిక (రేట్ కార్డు) ప్రకారం లెక్కించాలని స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తమ తనిఖీ సమయాన్ని ప్రధాన రహదారులపై 30 శాతం, అంతర్గత, గ్రామీణ రహదారులపై 30 శాతం, ఓటర్లు, ప్రజల నుంచి సమాచారం సేకరించేందుకు 40 శాతం చొప్పున వినియోగించుకోవాలని సూ చించారు. రవాణా వాహనాలు, వ్యా పార నగదు రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గత ఎన్నికల్లో అక్రమ నగదు పట్టుబడిన ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పోలీసు శాఖ గుర్తించిన సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.


