● పుష్కరాల భక్తుల కోసం కార్యాచరణ
● వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, కమిషనర్
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్లాస్టిక్ రహిత విధానంలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఆర్.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి అధికారులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమల ప్రతినిధులతో సమీక్షించారు. నగరపాలక సంస్థ (ఆర్‌ఎంసీ) కార్యాలయం నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ భక్తులకు తాగునీటి వసతుల కల్పనకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో జిల్లాకు సుమారు 80 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. ఒక్కో భక్తుడికి కనీసం మూడు లీటర్ల తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ వివరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ భక్తులు తమ వెంట తెచ్చుకునే వాటర్ బాటిళ్లను తిరిగి నింపుకొనేందుకు రీఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెండు వారాల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని, ఈలోగా తాగునీటి సరఫరాకు సంబంధించి వినూత్నమైన, పర్యావరణహిత పరిష్కారాలతో ముందుకు రావాలని సంబంధిత ఏజెన్సీలను కోరారు.


