జిల్లాలో 12.02 లక్షల మంది ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 12.02 లక్షల మంది ఓటర్లు

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పుగోదావరి నాలుగు జిల్లాలుగా విడిపోయిన తర్వాత తొలిసారిగా పరిషత్‌ ఎన్నికల నగారా మోగింది. 21 మండలాలతో ఏర్పడిన కొత్త తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌కు తొలి పాలకవర్గానికి అవసరమైన జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలైంది. జెడ్పీటీసీ స్థానాల్లో గెలిచి తొలి పరిషత్‌ పాలకవర్గంలో కొలువుదీరేందుకు ఆశావహులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు కొత్త జిల్లా పరిషత్‌ తొలి చైర్‌పర్సన్‌ పీఠాన్ని జనరల్‌ మహిళకు కేటాయించడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆశావహుల కసరత్తు ముమ్మరమైంది. ఈ కీలక పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు, చైర్‌పర్సన్‌ ఎంపికలోనూ పైచేయి సాధించడంపై దృష్టి సారిస్తున్నారు. సామాజిక, రాజకీయ సమీకరణాలు, స్థానికంగా ఉన్న బలాబలాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

జెడ్పీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు

ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న నామినేషన్ల పరిశీలన, 25న అభ్యర్థులపై అప్పీళ్లకు అవకాశం కల్పించారు. 26న ఆ అప్పీళ్లను పరిష్కరించనున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు 27 సాయంత్రంలోగా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం అదే రోజు సాయంత్రం పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. నవంబర్‌ 3న పోలింగ్‌, 5న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్ల కోసం ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

రిజర్వేషన్లకు అనుగుణంగా కసరత్తు

కొత్త జిల్లా పరిషత్‌ తొలి పాలకవర్గంలో చోటు దక్కించుకోవాలని జెడ్పీటీసీ ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ టికెట్ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు, తమకు అనుకూలంగా ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. మరోవైపు రిజర్వేషన్ల కారణంగా పోటీ చేసేందుకు అవకాశం కోల్పోయిన నాయకులు తమ భార్యలను రంగంలోకి దింపి పదవి సొంతం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. అందుకోసం పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికై ఎంపీపీ పదవులు చేపట్టేందుకు గ్రామాల్లో నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తంగా పరిషత్‌ పోరుతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఎక్కడెక్కడ.. ఎవరెవరికి

ఫ జిల్లాలోని 21 జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్సీ మహిళలకు మూడు, ఎస్సీ జనరల్‌కు రెండు, బీసీ మహిళలకు మూడు, బీసీ జనరల్‌కు రెండు, జనరల్‌ మహిళకు ఐదు, జనరల్‌ కేటగిరీకి ఆరు కేటాయించారు.

ఫ మొత్తం 21 ఎంపీపీ స్థానాల్లో ఎస్సీ మహిళలకు మూడు, ఎస్సీ జనరల్‌కు రెండు, బీసీ మహిళలకు మూడు, బీసీ జనరల్‌కు రెండు, జనరల్‌ మహిళకు ఐదు, జనరల్‌ కేటగిరీకి ఆరు కేటాయించారు.

ఫ అన్ని మండలాల్లో 412 ఎంపీటీసీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎస్టీలకు ఒకటి, ఎస్సీ మహిళలకు 40, ఎస్సీ జనరల్‌కు 48, బీసీ మహిళలకు 56, బీసీ జనరల్‌కు 57, జనరల్‌ మహిళలకు 107, అన్‌ రిజర్వుడ్‌ కేటగిరీలో 103 సీట్లు కేటాయించారు.

ఫ తూర్పు జెడ్పీకి తొలి పోరు

ఫ జనరల్‌ మహిళకు కేటాయింపు

ఫ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ

ఫ 24న పరిశీలన,

25న అప్పీళ్లు, 26న పరిష్కారం

ఫ 27న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన

ఫ నవంబర్‌ 3న పోలింగ్‌, 5న కౌంటింగ్‌

ఫ ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ప్రచురించిన ఓటర్ల గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 12,02,548 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,89,373 మంది పురుషులు, 6,13,141 మంది మహిళలు, 34 మంది ఇతరులు. సామాజిక వర్గాల వారీగా షెడ్యూల్డ్‌ తెగల ఓటర్లు 11,721 మంది, షెడ్యూల్డ్‌ కులాల ఓటర్లు 2,57,219 మంది, వెనుకబడిన తరగతుల ఓటర్లు 4,51,228 మంది, ఇతర కేటగిరీ ఓటర్లు 4,82,380 మంది ఉన్నారు.

ఫ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 1,476 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. వీటిలో 323 ప్రాంతాల్లో ఒక్కో పోలింగ్‌ కేంద్రం, 247 ప్రాంతాల్లో రెండు చొప్పున, 92 ప్రాంతాల్లో మూడు చొప్పున, 199 ప్రాంతాల్లో మూడు కంటే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

డిపాజిట్లు.. ఖర్చుల పరిమితులు

ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిపాజిట్‌ మొత్తం రూ.1,500 కాగా, ఇతర అభ్యర్థులకు రూ.3 వేలుగా నిర్ణయించారు. జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.3 వేలు, ఇతర అభ్యర్థులకు రూ.6 వేలు డిపాజిట్‌గా నిర్దేశించారు. ఎన్నికల వ్యయ పరిమితి ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షలుగా నిర్ణయించారు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

నామినేషన్ల స్వీకరణ సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు, నగదు, మద్యం, ఇతర ప్రలోభాల పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఓటర్ల జాబితాల ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, రిజర్వేషన్ల ఖరారు, గెజిట్‌ ప్రచురణ వంటి ముందస్తు ప్రక్రియలను పూర్తి చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement