కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ డి.నరసింహకిశోర్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకొంటున్నామని, ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలన్నారు. ప్రతి ఒక్కరూ చేపట్టిన పనుల్లో విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
9 వేల క్యూసెక్కుల
నీరు విడుదల
ధవళేశ్వరం: గోదావరి డెల్టా కాలువలకు 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 2 వేలు, మధ్య డెల్టాకు 1,500, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజ్ నుంచి 5,120 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు.
వైఎస్సార్ సీపీలోకి చేరికలు
సామర్లకోట: స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వైఎస్సార్ సీపీలోనికి జోరుగా చేరికలు జరుగుతున్నాయి. దీంతో, ఆ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక మంది వైఎస్సార్ సీపీలో చేరగా.. సోమవారం సామర్లకోట గణేష్ కాలనీకి చెందిన పలువురు ఆ పార్టీకి జైకొట్టారు. వారికి స్థానిక కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. రెండు నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో తటస్థులు పలువురు వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఇరుసుమళ్ల సాయి, మాజీ కౌన్సిలర్ మర్రి శేషారావు, నాయకులు పాలిక చంటి, కచ్చా రాజు తదితరులు పాల్గొన్నారు.
జనసేనకు కీలక నేత గుడ్‌బై
మలికిపురం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజోలు నియోజకవర్గంలో జనసేన నుంచి కీలక వికెట్ పడింది. తమ కంచుకోట అని ఆ పార్టీ చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచీ జనసేన విజయానికి విశేష కృషి చేసిన సీనియర్ నాయకుడు ఆరేటి మురళీకృష్ణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ మలికిపురం మండల అధ్యక్షుడు మల్లిపూడి సత్తిబాబుకు తెలిపానని పేర్కొన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని తన ఇంటి వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మురళి ఈ విషయం తెలిపారు. జనసేన అభివృద్ధికి 2009 నుంచీ అహర్నిశలూ పని చేశామని, ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు తనకు నచ్చడం లేదని అన్నారు. జనసేన నిర్ణయాలు కూడా సరైనవి కాకపోవడం వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆయన చెప్పారు.
రత్నగిరి కిటకిట
అన్నవరం: దసరా వేడుకల తొమ్మిదో రోజున మహర్నవమి పర్వదినం సందర్భంగా రత్నగిరి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వీరిలో భవానీ దీక్షాధారులే అధికంగా ఉన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్తూ, మార్గం మధ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా మంగళవారం కూడా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది.


