రాజమహేంద్రవరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ బుధవారం నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను అరికట్టేందుకు 10 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు (ఎఫ్‌ఎస్‌టీ), 15 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) బృందాలు, 10 స్టాటిక్ సర్వైలెన్ టీమ్‌లు (ఎస్‌ఎస్‌టీ) పనిచేస్తున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీ జరగకుండా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలకు తావులేకుండా ఈ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గామన్ బ్రిడ్జి వద్ద ఎస్‌ఎస్‌టీ–2 బృందం తనిఖీలు చేపట్టింది. ఈ బృందంలో పి.కృష్ణవేణి, హెడ్ కానిస్టేబుల్ కె.గోపి, వీడియోగ్రాఫర్ కె.వినాయక రాజా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎఫ్‌ఎస్‌టీ–2 బృందంలో అధికారి ఎస్‌కే మదర్ సాహెబ్, వీడియోగ్రాఫర్ రాజా, పోలీస్ కానిస్టేబుల్ బాబూరావు తనిఖీల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తనిఖీలను నిరంతరం కొనసాగిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు.


