కపిలేశ్వరపురం (మండపేట): సమాజంలో రుగ్మతలను రూపుమాపేలా రాజకీయాలు ఉండాలి. అదే భారత రాజ్యాంగం చెబుతుంది. వైఎస్సార్ సీపీ అదే విధానంతో మున్సిపల్ ఎన్నికల్లో విద్యాధికుడైన డాక్టర్ కె.రామును ఎంపిక చేసింది. మండపేట పట్టణ ప్రజల ముందు విద్యాధికుడు, సేవాతత్పరుడైన వైద్యుడు రాముని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నిలిపింది. అందరినీ నవ్వుతూ పలకరించే సౌమ్యుడు రాము. ఆయన ఎంపిక పట్ల పార్టీ నిర్ణయాన్ని పట్టణ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా రాము 2009 –2012 మధ్య కపిలేశ్వరపురంలో, 2015–18 మధ్య మండపేటలో, 2019–2021 మధ్య ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేశారు. సివిల్ సర్జన్‌గా పదోన్నతిపై 2022లో నెల్లూరు జిల్లా కావలి ఆసుపత్రిలో చేరారు. అక్కడ పనిచేస్తూ అదే ఏడాది ప్రభుత్వ విధులకు రాజీనామా చేశారు. మండపేట పట్టణంలో ప్రైవేట్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి నెలకొల్పి సేవలందిస్తున్నారు.
పేద విద్యార్థినిని చదివిస్తూ..
వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ కె.రాము సేవా తత్పరుడు. తనలాగే తనలాంటి వారు వైద్యులుగా తయారు కావాలన్న లక్ష్యంతో పేద విద్యార్థులకు చదువుల్లో సాయం చేస్తున్నారు. బిక్కవోలుకు చెందిన నిరుపేద జెన్నీఫర్ నీట్‌లో మెరుగైన ప్రతిభ కనబర్చి ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆమె చదువుకు సంబంధించిన ఐదేళ్ల యూనివర్సిటీ ఫీజు తానే చెల్లిస్తానని డాక్టర్ రాము ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం ఆయన జెన్నీఫర్ ఎంబీబీఎస్ మొదటి ఏడాది యూనివర్సిటీ ఫీజును ఇటీవల చెల్లించారు.
సేవ చేసే అవకాశాలు మెండు
డాక్టర్ రాము పేదరికం నుంచి వచ్చారు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి. తనలా కష్టపడే వారంటే ఎంతో గౌరవం. పేదలంటే ఎంతో మమకారం గల వ్యక్తిగా ఆయన్ని పట్టణ ప్రజలు చూస్తున్నారు. వైద్యపరంగా తాను అందించే సేవలకు తోడు రాజకీయాల్లోకి వచ్చి మున్సిపల్ చైర్మన్ కావడం ద్వారా పట్టణ ప్రజలకు సామాజిక సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని డాక్టర్ రాము ఆకాంక్షిస్తున్నారు.
మండపేట వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బయోడేటా..
పేరు : డాక్టర్ కాట్రవతు రాము
వయసు : 43 ఏళ్లు
తల్లిదండ్రులు : సుభద్ర, శంకరం
భార్య : వసంత (గృహిణి)
ఎంబీబీఎస్ : రంగరాయ మెడికల్ కళాశాల, కాకినాడ (2001– 07)
పీజీ : రంగరాయ మెడికల్ కళాశాల, కాకినాడ (2012–15)
వృత్తి : వైద్యుడు
·˘ మండపేట వైఎస్సార్ సీపీ
అభ్యర్థిగా డాక్టర్ రాము
·˘ సేవకుడిగా, సౌమ్యుడిగా ప్రజల్లో పేరు
·˘ పేద విద్యార్థుల చదువుకు సాయం


