● మహానేతకు వాడవాడలా నివాళి ● సేవలను స్మరించుకున్న ప్రజలు ● విగ్రహాలు, చిత్రపటాలకు పుష్పాంజలి
ఆత్మబంధువు మహాభినిష్క్రమణం జరిగి 17 ఏళ్లు గడిచిపోయినా, ఆ చిరునవ్వు, ఆ పలకరింపు
జనం గుండెల్లో నేటికీ పదిలంగానే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా మళ్లీ కొట్టుకుంటున్న గుండె చప్పుళ్లలో వైఎస్సార్ సజీవంగానే ఉన్నారు. 108 ద్వారా ప్రాణాలు నిలిచిన వారు రాజన్న రూపాన్ని శాశ్వతంగా మదిలో ప్రతిష్ఠించుకున్నారు. మహానేత వర్ధంతి సందర్భంగా గోదావరి తీర వాసులంతా బుధవారం ఆత్మబంధువుకు హృదయాంజలి ఘటించారు. మా కోసం మళ్లీ పుడతావా రాజన్నా అంటూ స్మరించుకున్నారు. వాడవాడలా ఆ మహనీయుని విగ్రహాలు,
చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. – సాక్షి, రాజమహేంద్రవరం
జలసిరులు కురిపించిన భగీరథుడు
జలయజ్ఞంతో జలసిరులు కురిపించి, పంట పొలాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఇన్‌చార్జి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఉచిత విద్యుత్‌తో మెట్ట ప్రాంత రైతులకు ఎంతగానో మేలు చేశారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీతో లక్షలాది మంది లబ్ధి పొందారన్నారు. ఇదే కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక విశ్వాసం, సంక్షేమానికి మారుపేరు అని కొనియాడారు. 2003లో భయంకరమైన ఎండలను సైతం లెక్కచేయకుండా సాగించిన ప్రాజాప్రస్థానం పాదయాత్రతో తెలుగు నేల చరిత్రను తిరగరాశారన్నారు.
వైఎస్సార్ పాలన స్వర్ణయుగం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలో స్వర్ణయుగం నడిచిందని, సంక్షేమ పథకాల ద్వారా అన్ని కుటుంబాలకు మేలు చేకూర్చిన ఘనత ఆ మహనీయునికే దక్కుతుందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి మార్గాని భరత్‌రామ్ కొనియాడారు. వీఎల్ పురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావుతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి భరత్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే మహానేత ఆశయాలు నెరవేరుతాయన్నారు.
పేదల పెన్నిధి
సంక్షేమ పథకాల ద్వారా పేదలను ఆదుకున్న మహనీయుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువులో వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తండ్రి ఆశయాల సాధనలో భాగంగా అన్ని వర్గాలకూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు.
పేదల గుండెల్లో సజీవం
అనపర్తి కెనాల్ రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో ఆయన సజీవంగానే ఉన్నారన్నారు. వైఎస్సార్ అమలు చేసిన 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో లబ్ధి పొందారన్నారు.
సమస్యలను అధ్యయనం చేసిన మేధావి
సామాన్యుల సమస్యలను అధ్యయనం చేసిన మేధావిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మండపేట పట్టణంలోని రాజారత్న సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం త్రిమూర్తులు మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను లోతయిన ప్రజా కోణంలో వైఎస్సార్ అధ్యయనం చేశారన్నారు. అందువల్లే ఆరోగ్య శ్రీ, రుణమాఫీ వంటి ప్రజోపయోగ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.
జనం గుండెల్లో కొలువైన దేవుడు
కొవ్వూరులోని మెరక వీధి, మెయిన్ రోడ్డులోవైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు నివాళులర్పించారు. అనంతరం వృద్ధాశ్రమంలో భోజనాలు వడ్డించి పండ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందజేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. మహానేత ఆశయాలకు కొనసాగింపుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగిందని గుర్తు చేశారు.
కొవ్వూరులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
అనపర్తి కెనాల్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తదితరులు


