సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అమరావతి చాంపియన్‌షిప్ 2026 రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి, 9 బంగారు, 20 వెండి పతకాలతో మొత్తం 29 పతకాలు సాధించారు. యోగా, విలువిద్య, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడాంశాల్లో పాల్గొని ప్రతిభ చాటారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన క్రీడాకారులు సాధించిన ఈ విజయం అభినందనీయమని కలెక్టర్ కీర్తి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో క్రీడాకారులను ఆమె అభినందించారు. నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల విజయానికి కృషి చేసిన కోచ్‌లు, నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో డీఎంఎం శేషగిరి, డీఎస్‌డీఓ కె.శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెనూ కచ్చితంగా పాటించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను కచ్చితంగా అమలు చేసి, విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. సరైన భోజనం అందక విద్యార్థులు క్యాటరింగ్‌లకు వెళ్లి భోజనం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. వారికి కేటాయించిన సంక్షేమ నిధులను సక్రమంగా వినియోగించి, హాస్టళ్లలోనే నాణ్య మైన భోజనం అందించాలన్నారు. ఆకస్మిక తనిఖీల సమాచారం ముందుగానే ఎలా బయటకు వెళ్తోంది, ఎవరి ద్వారా సమాచారం చేరుతోంది, అనే అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలన్నారు. ఇటీవల ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా ముందుగానే సమాచారం సేకరించి, హాస్టళ్లలో జాగ్రత్తలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నా రు. వాస్తవ పరిస్థితులను అధికారులు దాచిపెట్టకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. అలాగే నూతన అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కూడా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేయాలన్నారు.


