కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డీఎల్‌ఎడ్ 2వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 16 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి ఎస్.వాసుదేవరావు బుధవారం తెలిపారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. వీటి నిర్వహణకు సంబంధించి టైమ్ టేబుల్‌ను విద్యార్థులు ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మళ్లీ వచ్చిన బెబ్బులి
దేవీపట్నం: అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులి మళ్లీ దేవీపట్నానికి చేరింది. ఈ ఏడాది తొలకరి ఆరంభంలో పోలవరం జిల్లాలోని పాపికొండల అభయారణ్య ప్రాంతమైన దేవీపట్నం, పూడిపల్లి తదితర ప్రాంతాల్లో తిష్టవేసిన పెద్దపులి ఎట్టకేలకు జూన్‌లో గోదావరి దాటుకుని ఏలూరు జిల్లాలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి సుమారు రెండునెలలకు పైబడి తెలంగాణ వరకూ సంచరించి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చేరింది. రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు సమీపాన సంచరించిన పెద్దపులి మంగళవారం అర్ధరాత్రి సింగనపల్లి వద్ద గోదావరి దాటుకుని పోలవరం జిల్లాలోని దేవీపట్నం ఎగువ ప్రాంతానికి చేరింది. పెద్దపులి మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా పులి గమనాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు దేవీపట్నం పరిసర గ్రామాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. గత వారం రోజులుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అభయారణ్యంలో సంచరించిన పెద్ద పులి ఒక దూడను హతమార్చి, మరో దూడను గాయపరచిందని పోలవరం అటవీ శాఖ రేంజ్ అధికారి ఎస్‌కే వలీ తెలిపారు.
బాలికా సదనం సందర్శన
కంబాలచెరువు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మి బుధవారం ప్రభుత్వ బాలికా సదనాన్ని సందర్శించి, అక్కడి వసతులను పరిశీలించారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ అందుతున్న సౌకర్యాలు, ఆహారం తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థినులు బాగా చదువుకుని, ఉన్నత స్థాయికి చేరుకుని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. బాలికలకు మంచి స్పర్శ, చెడు స్పర్శ, బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో యాక్ట్ 2012పై అవగాహన కల్పించారు. తమకు ఎదురయ్యే అనుమానాస్పద పరిస్థితులు, ఇబ్బందులకు భయపడకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలోని కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల సమీపంలోని కేవీ స్టేట్ హోమ్‌ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు.
ఫారెస్టు అకాడమీలో
ముగిసిన వర్క్‌షాప్
రాజానగరం: లాలాచెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్టు అకాడమీలో డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్.ఇండియా సహకారంతో ‘వన్యప్రాణి చట్టాలు – అమలు’పై రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాప్ బుధవారం ముగిసింది. వన్యప్రాణుల అక్రమ రవాణాను అరికట్టడంలో అటవీ సిబ్బందికి సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వన్యప్రాణి ఫోరెన్సిక్ నిపుణులు (డెహ్రాడూన్) డాక్టర్ సీపీ శర్మ, సీనియర్ సైంటిస్టు (హైదరాబాద్) డాక్టర్ అజయ్ గౌర్, సీనియర్ అటవీ అధికారి (మహారాష్ట్ర) రాజేంద్ర దొంగ్డే, విశేష్ ఉప్పల్ (న్యూఢిల్లీ), డాక్టర్ మెర్విన్ పెర్నాండేజ్ (డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్. ఇండియా డైరెక్టర్), ఐటీ స్పెషలిస్టు అంకుర్, మున్నగు వివిధ శాఖల నిపుణులు పాల్గొన్నారు. వన్యప్రాణి రక్షణ చట్టం – 1972, సవరణలు, సాక్ష్యాల సేకరణ, నేరాల గుర్తింపు, సీజ్ చేసే విధానం, కోర్టు ప్రక్రియలు, ప్రాసిక్యూషన్, మానవ – వన్యప్రాణి సంఘర్షణల చట్టపరమైన అంశాలు, అమలులో సాంకేతిక వినియోగం వంటి కీలక అంశాలపై అవగాహన కలిగించారు. ముగింపు కార్యక్రమంలో వర్క్‌షాప్‌లో పాల్గొన్న రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అటవీ అధికారులకు ్ల ఎస్పీ నరసింహ కిషోర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫారెస్టు అకాడమీ డైరెక్టర్ బి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


