పేదల గుండె చప్పుడు వైఎస్సార్‌ | - | Sakshi
Sakshi News home page

పేదల గుండె చప్పుడు వైఎస్సార్‌

Sep 3 2026 4:03 AM | Updated on Sep 3 2026 4:03 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు

దూబచర్లలో మహానేత విగ్రహం ఆవిష్కరణ

పాల్గొన్న మాజీ హోం మంత్రి వనిత,

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

దేవరపల్లి: ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేదల గుండె చప్పుడుగా మారారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా నల్లజర్ల మండలం దూబచర్లలోని వైఎస్సార్‌ వసంత్‌ నగర్‌ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన మహానేత విగ్రహాన్ని మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పలువురు నేతలు ఆవిష్కరించారు. అక్కడే నిర్మించిన బస్‌షెల్టర్‌ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డే రఘురామ్‌, రచ్చబండను జక్కంపూడి రాజా, డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ ప్రారంభించారు.

దేశానికే వైఎస్సార్‌ ఆదర్శం

పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.1 లక్ష కోట్లతో 86 ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. 108 అంబులెన్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తీసుకు వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. దూబచర్లలో వైఎస్సార్‌ వసంత్‌ నగర్‌ ద్వారం, బస్‌ షెల్టర్‌, రచ్చబండకు వేసిన వైఎస్సార్‌ సీపీ రంగులను రాత్రికి రాత్రి పోలీసులు, రెవెన్యూ అధికారులు మార్చి తెలుపు రంగు వేశారన్నారు. వైఎస్సార్‌ సీపీ రంగులంటే పాలకులు ఎంత భయపడుతున్నారో దీని ద్వారా స్పష్టమైందన్నారు.

జగన్‌ పోరాటంతో రైతులకు మేలు

మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేయడంతో పొగాకు రైతులందరికీ మేలు జరిగిందన్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లో రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ అడగకుండానే ఎదురొచ్చి పేదలకు ఆదుకున్న మహానేత రాజశేఖరెడ్డి అని ఆయన అన్నారు. ఆయన జ్ఞాపకాలను కాలనీ వాసులు గుండెల్లో గూడుకట్టుకుని కాలనీకి ద్వారం, బస్టాప్‌, రచ్చబండ నిర్మించుకోగా ఓ వ్యక్తి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారుల చేత రాత్రికి రాత్రే రంగులు మార్చారన్నారు. వైఎస్సార్‌ సీపీ రంగులపైన తెల్ల రంగు వేస్తే గుండెల్లో ఉన్న అభిమానం చెరిగిపోదని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, విగ్రహ నిర్మాణ కర్త మాజీ ఎంపీపీ చేబ్రోలు చిన వెంకటేశ్వరరావు(కొండ), ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు, వామిశెట్టి పరమేశ్వరరావు, వామిశెట్టి పావనీ కుమారి, సయ్యద్‌ మునాఫ్‌, బొండాడ వెంకన్నబాబు, సాలి వేణు, ముప్పిడి వెంకటరత్నం, దోవా సాయి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

భారీ ర్యాలీ

గ్రామ శివారు నుంచి వైఎస్సార్‌ కాలనీ వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2 కిలో మీటర్లు సాగిన ఈ ర్యాలీకి ప్రజలు, పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. తొలుత స్థానిక వరసిద్ధి వినాయకుడి ఆలయంలో పార్టీ నేతలు పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement