ఫ పురుషోత్తపట్నం ఎత్తిపోతల వద్ద ఆందోళన
ఫ సాగునీటి విడుదలను అడ్డుకుని నిరసన
ఫ పరిహారం అందించాలని డిమాండ్
సీతానగరం: బలవంతంగా సేకరించిన భూములకు పరిహారం ఎప్పుడిస్తారంటూ రైతులు మండిపడ్డారు. మంగళవారం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద భూములు కోల్పోయిన రైతులు నీటి విడుదలను అడ్డుకుని, మోటార్లను నిలిపివేశారు. పురుషోత్తపట్నం, రామచంద్రపురం, సీతానగరం, చినకొండేపూడి గ్రామాలకు చెందిన కరుటూరి శ్రీనివాస్, కోడేబత్తుల ప్రసాదరావు, దుద్దిపూడి శ్రీనివాసరావు, ఉండవల్లి రమేష్, నానిబాబు, మట్ట వసంతరావు, సుంకవల్లి పుష్పలతో పాటు సుమారు 45 మంది రైతులు ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుని పథకం మోటార్లను నిలిపివేశారు. అక్కడ టెంట్ వేసి నిరసన తెలిపారు. తమ భూములను అక్రమంగా తీసుకుని రోడ్డున పడేస్తారా, కంటి తుడుపు చర్యలతో ఎన్నాళ్లు మోసం చేస్తారని ధ్వజమెత్తారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్, పైప్‌లైన్ల పేరుతో రైతుల నుంచి దౌర్జన్యంగా భూములను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో కొంతమందికి అరకొర పరిహారం ఇచ్చారన్నారు. పరిహారం ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు సైతం రైతులకు అనుకూలంగా పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. జూలైలో ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలకు వచ్చిన ఎమ్మెల్యే బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కాకినాడ పార్లమెంట్ ఇన్‌చార్జ్ జ్యోతుల నవీన్ తదితరులను అడ్డుకున్నామని నెల రోజుల్లో పరిహారం అందిస్తామని, అలాకాని పక్షంలో మీతోపాటే ఆందోళనకు దిగుతామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. గడువు దాటి చాలా రోజులైనా పరిహారం మాటే ఎత్తడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చే వరకు పథకం నుంచి నీటి చుక్క వదిలేది లేదని రైతులు తేల్చిచెప్పారు. ఘటనా స్థలానికి జలవనరుల శాఖ ఈఈ పేరయ్య, డీఈ కోటేశ్వరరావు, జేఈ సుమంత్, నార్త్‌జోన్ డీఎస్పీ సీహెచ్ జీవన, సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి, ఎస్సై ఎల్.శ్రీనునాయక్, ఇతర మండలాల ఎస్సైలు, స్పెషల్ ఫోర్స్ వచ్చింది. రైతులతో చర్చలు జరిపింది. ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు వెళ్లేది లేదని వారు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో సీఐ మూర్తి, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ మూర్తి రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణచౌదరికి ఫోన్‌లో పరిస్థితిని వివరించారు.
నిర్వాసితులకు రూ. 32.10 కోట్ల పరిహారం
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిమిత్తం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, చట్టబద్ధమైన వడ్డీ చెల్లింపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.32.10 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీఓ నంబర్ 496ను విడుదల చేశారు. సీతానగరం మండలానికి చెందిన బి.సత్యనారాయణ సహా 28 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా, 2025 అక్టోబర్ 31న కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని అధికారులు ఎదుర్కొంటున్న కోర్టు ధిక్కరణ కేసు విచారణకు వచ్చింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, ఆర్డీఓ ఆర్.కృష్ణ నాయక్‌లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.
మొండిచేయి చూపారు
సేకరించిన భూములకు అందించాల్సిన పరిహారం అందుకోకుండా సుమారు ఎనిమిది మంది రైతులు మరణించారు. 2017లో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని మొండిచేయి చూపారు. పరిహారం అందించడంలో జాప్యం తగదు. అప్పటి సీఎం, ఇప్పటి సీఎం చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు.
– కొండు నానిబాబు, రైతు, పురుషోత్తపట్నం
నయా పైసా ఇవ్వలేదు
ఎత్తిపోతల పథకం హెడ్‌వర్స్క్‌కు 2.50 ఎకరాలు, పైప్‌లైన్‌లో రెండెకరాలను బలవంతంగా తీసుకుని, మాపై కేసులు పెట్టారు. కోర్టును ఆశ్రయించగా సానుకూలంగా స్పందించినా, ప్రభుత్వం పరిహారం అందించడం లేదు. జూలైలో పథకం నుంచి సాగునీటి విడుదలకు వచ్చిన ప్రజాప్రతినిధులను అడ్డుకోగా నెల రోజుల్లో పరిహారం ఇప్పిస్తామని అన్నారు. అయినా పైసా ఇవ్వలేదు.
–కరుటూరి శ్రీనివాస్, రైతు, రామచంద్రపురం


