బిడ్డ భారం కాకున్నా.. పోషణకు సాయం చేయండన్నా..! | - | Sakshi
Sakshi News home page

బిడ్డ భారం కాకున్నా.. పోషణకు సాయం చేయండన్నా..!

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

పింఛను కోసం తల్లిదండ్రుల ఎదురు చూపు

వంద శాతం వైకల్య ధ్రువపత్రం ఉన్నా

అధికారుల నిర్లక్ష్యం

అల్లవరం: పుట్టుకతో అంధుడు.. మాట్లాడలేడు.. నడవలేడు ఆపై మానసిక రుగ్మత ఇన్ని సమస్యలు ఎదురుగా కనిపిస్తున్నా అతడు ప్రభుత్వ పింఛనుకు నోచుకోని అభాగ్యుడు అతడు. అల్లవరం మండలం రెల్లుగడ్డ పంచాయతీ ఎలువుల్లంక గ్రామానికి చెందిన బొంతు కోటేశ్వరరావుకు మొదటి సంతానంగా వివేకానంద పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు పుట్టారు. కొడుకు పుట్టిన ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలువలేదు. ఆరు నెలలు గడిచేసరికి చిన్నారి చూడలేకపోతున్నాడని ఆ తల్లి గ్రహించింది. అతడి చూపు కోసం తిరగని ఆస్పత్రి లేదు. స్థోమతకు మించి ఖర్చు చేశారు. తలలో నీరు పట్టింది, దాని వల్లే చూపు కోల్పోయాడు, ఆపరేషన్‌ చేస్తే చూపు వస్తుందన్న వైద్యుల సలహాతో తొమ్మిది నెలలకు ఆపరేషన్‌ చేశారు. రెండేళ్లు నిండాక మరో శస్త్ర చికిత్స చేశారు. అయినా ఆ బాబు చూపులో ఎలాంటి మార్పు రాలేదు. అప్పటి నుంచి తల్లే అన్నీ తానై కుమారుడు వివేకానందకు సపర్యలు చేస్తూ వచ్చింది. వివేకానంద పెరిగి పెద్దవాడైనా నేటికీ తల్లిదండ్రులను సరిగా పిలవలేడు. ఆ తల్లిదండ్రులకు అతడు భారం కాకపోయినా పన్నెండేళ్లుగా సాకుతూనే ఉన్నారు. అతడికి ప్రభుత్వం ద్వారా ఏదైనా సాయం అందించాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. సామాజిక భద్రత ద్వారా పింఛన్‌ మంజూరు చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సదరమ్‌ శిబిరంలో పరీక్షలు నిర్వహించి టెంపరరీ సర్టిఫికేట్‌ ఇవ్వగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 100 శాతం అంగవైకల్యం ఉన్నట్లు శాశ్వత సర్టిఫికెట్‌ ఇచ్చారని తల్లి నాగమణి చెప్పంది. అయినా నేటికీ ప్రభుత్వం వారు పింఛన్‌ మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ స్పందించి తన ప్రత్యేక అధికారాలతో వివేకానందకు వికలాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement