అందని ద్రాక్ష పుల్లన అంటారు.. కానీ. తమ ఇంట్లో చేతికి అందేలా పండుతున్న ఈ ద్రాక్ష ఎంతో తీయన అని అంటున్నారు అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన రవణం సత్యకుమార్, వెంకట కనకదుర్గ దంపతులు. ద్రాక్ష సాగుకు కోనసీమ జిల్లా సాధారణంగా అనుకూలంగా ఉండదు. కానీ, సత్యకుమార్ దంపతులు ప్రత్యేక శ్రద్ధతో తమ ఇంట్లో ద్రాక్షపాదును పెంచారు. ఈ ద్రాక్ష తీగను మూడేళ్ల కిందట కడియపులంక నుంచి తెచ్చి నాటారు. ఎటువంటి రసాయన ఎరువులూ వాడకుండా ఇంట్లో ఉపయోగించే కూరగాయల ఆకులు, ఎర్రమట్టి, వర్మి కంపోస్టు ఎరువుగా వేశారు. దీంతో, ద్రాక్ష తీగ డాబా వరకూ వేగంగా పాకింది. రెండేళ్ల నుంచి గుత్తులుగుత్తులుగా నల్ల ద్రాక్ష పండ్లను విరగకాస్తోంది. ఏటా 10 నుంచి 15 కేజీల వరకూ నల్ల ద్రాక్ష పండ్లు వస్తున్నాయని సత్యకుమార్ చెప్పారు. ఈ పండ్లను బంధువులకు, గ్రామస్తులకు పంచుతామని, తమ ఇంట్లో ద్రాక్ష పండ్లు పండించడం అనందంగా ఉందని అన్నారు.
– అమలాపురం రూరల్


