రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి
రావులపాలెం: కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ విషాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన మైనర్ రియాన్ష్ కార్తికేయరెడ్డికి పూర్తి రక్షణ కల్పించి, అతని భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు. స్థానిక బాలుడి తాతయ్య కొవ్వూరి భాస్కరరెడ్డి ఇంటికి శుక్రవారం ఆయనతో పాటు కమిషన్ సభ్యులు వచ్చి రియాన్ష్‌ను పరామర్శించి మాట్టాడారు. విషాద ఘటన పూర్వాపరాలను తెలుసుకుని అతని రక్షణ, విద్య, భవిష్యత్తుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బాలుడిని, ఆమె తల్లిని సాధిక్ ఖాన్ ఏ విధంగా వేధించినదీ తెలుసుకున్నామని తెలిపారు. కలెక్టరేట్‌లో ఈ మేరకు సమీక్షించి తదుపరి చర్యలకు ప్రభుత్వానికి, డీజీపీకి అవసరమైన సిఫార్సులు, ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కమిషన్ సభ్యురాలు డాక్టర్ పి.నాగ మానస మాట్లాడుతూ అతని భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


