ఒకరు ఔనంటారు.. మరొకరు కాదంటారు.. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలపై గజిబిజి సృష్టిస్తున్నారు.. ఒక ఎమ్మెల్యే పంచాయతీల విలీనంతో ఎన్నికలకు వెళ్తామని చెబుతుంటే, మరొకరు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అనడం గందరగోళానికి దారితీస్తోంది.. చివరికి ఎటెళ్తుందో తెలియక జనం తికమక పడుతున్నారు.. ఆ కథేంటో తెలుసుకుందాం రండి.
సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణపై మాత్రం తీవ్ర గందరగోళం నెలకొంది. విలీన గ్రామాల వివాదాలు, న్యాయస్థానాల్లో పిటీషన్ల కారణంగా గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా, రాజమహేంద్రవరం విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. ఇప్పటికే చాలా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. ఇక్కడ మాత్రం ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదు సరికదా ప్రజాప్రతినిధుల భిన్న ప్రకటనలతో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. ‘రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని పంచాయతీల్లో చాలా ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. అందుకే వాటన్నింటితో గ్రేటర్ రాజమహేంద్రవరం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తాం. పంచాయతీల విలీనం విషయంపై కోర్టుకు వెళ్లిన వారిని విత్‌డ్రా చేసుకోమని కోరుతున్నాం. విలీన ప్రక్రియ పూర్తయితే డివిజన్ల సంఖ్య కూడా పెరుగుతుంది’ అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటున్నారు. మరోవైపు ‘గతంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో విలీనం చేయడంతో కొన్నేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగడం లేదు. విలీన ప్రక్రియ నుంచి మినహాయించడంతో త్వరలో రాజానగరం నియోజకవర్గంలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల్లో పోటీకి ఆశావహులంతా సిద్ధంగా ఉండాలి’ అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల ప్రకటనలతో నగరపాలక సంస్థ ఎన్నికలపై మరింత గందరగోళం పెరిగింది.
విలీనం.. గందరగోళం
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధి పెంచాలనే ఉద్దేశంతో గతంలో రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరు, రాజవోలు, ధవళేశ్వరం, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, కోలమూరు, కాతేరు, వెంకటనగరం, తొర్రేడు, కడియం మండలం వేమగిరి పంచాయతీలను విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. అలానే రాజానగరం మండలం నామవరం, లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్‌చెరువు (శ్రీరామపురం, రఘునాథపురం), పాలచర్ల, వెలుగుబంద, చక్రద్వారబంధం, కోరుకొండ మండలం మధురపూడి, బూరుగుపూడి, గాడాల, నిడిగట్ల పంచాయతీల విలీనానికి ప్రతిపాదించారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ వివాదం తేలకపోవడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది.
అందుకే ఎత్తుగడా?
గోదావరి పుష్కరాల వేళ ఎదురు లేకుండా చేసుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ ఎన్నికలకు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. మేయర్‌తో పాటు కార్పొరేటర్లు ఉంటే తమ ప్రభావం తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రూ.వేల కోట్లతో పుష్కర పనులు చేపడతామని గొప్పలు చెబుతుండగా, ఆ పనుల్లో తమ మాటే చెల్లాలి.. తమ వారికే పనులు కట్టబెట్టుకోవాలి.. నాలుగు డబ్బులు వెనకేసుకోవాలంటే నగర కార్పొరేషన్‌కు పాలకవర్గం లేకుండా ఉండాలని భావిస్తున్నారు. అప్పుడే తమకు నచ్చిన అధికారులను నియమించుకుని ఇష్టారీతిన పుష్కరాల పనులు చేపట్టుకోవచ్చని, ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే భిన్న ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పుష్కరాల లోపు కార్పొరేషన్ ఎన్నికలు జరగనివ్వరని భావిస్తున్నారు.
ఫ గ్రామాల విలీనంపై గందరగోళం
ఫ గ్రేటర్ రాజమహేంద్రవరం
అంటున్న గోరంట్ల
ఫ పంచాయతీల్లోనే
ఎన్నికలు జరుగుతాయంటున్న బత్తుల
ఫ కూటమి ప్రజాప్రతినిధుల
మధ్య భిన్న ప్రకటనలు


