ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలో బుధవారం వరద ఉరవడి పెరిగిన విషయం తెలిసిందే. ఇది క్రమంగా గురువారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం కాటన్ బ్యారేజీ నుంచి 5.17 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. సాయంత్రానికి వరద తగ్గడంతో మిగులు జలాల విడుదలను 4,72,218 క్యూసెక్కులకు తగ్గించారు. ఎగువన భద్రాచలం వద్ద 27.40 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులుగా గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి.
ఓటర్ల జాబితా
త్వరగా సిద్ధం చేయాలి
నిడదవోలు: త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వచ్చే నెల మూడో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించాలని, అలసత్వం లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, టౌన్ ప్లానింగ్ అధికారి ఎస్.సుప్రియ, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.


