రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు రాత్రి సమయంలో విధులు నిర్వహించిన తరువాత నిద్రించేందుకు ఏర్పాటు చేసిన రెస్ట్ రూమ్‌లో పడుతున్న ఇబ్బందులపై జిల్లా ప్రజారవాణా అధికారి సత్యనారాయణ మూర్తి దృష్టి సారించారు. బుధవారం ‘సాక్షి’లో వచ్చిన ‘పడక కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన కష్టాలపై సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. రావులపాలెం డిపోకు రెండు బెడ్లు కేటాయించాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్బంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, రావులపాలెం, గోకవరం, రాజమహేంద్రవరం డిపోల నైట్ హాల్ట్ బస్సులు ఆధారంగా బెడ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతూ డిపో మేనేజర్ కె.మాధవ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ రెస్ట్ రూమ్ పరిశీలనకు సూపర్‌వైజర్‌ను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఉన్న 30 బెడ్లను అవసరాలను గుర్తించి డ్రైవర్, కండక్టర్లకు కేటాయించినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం డిపోకు సంబంధించి, ఆలస్యంగా వచ్చిన వారు, తెల్లవారు జామున విధులకు వెళ్లే వారికి 6 బెడ్లు కేటాయించామన్నారు. అలాగే పాత డిస్పెన్సరీ భవనాన్ని మరో 30 పడకలతో విశ్రాంత భవనంగా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే నెలాఖరుకు వీటిని సిద్ధం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
డిపోల వారీగా కేటాయింపులు ఇలా..
డిపో బెడ్లు
అమలాపురం 6
రాజోలు 6
రామచంద్రపురం 6
రావులపాలెం 2
గోకవరం 4
రాజమహేంద్రవరం 6
మొత్తం 30
ఆర్టీసీ రెస్ట్ రూమ్‌లను పరిశీలించిన డీపీటీఓ మూర్తి
రావులపాలెం డిపోకు
రెండు బెడ్ల కేటాయింపు
త్వరలో మరో 30 పడకలతో
విశ్రాంతి గదులు


