పడక కష్టాలు | - | Sakshi
Sakshi News home page

పడక కష్టాలు

Aug 26 2026 12:12 AM | Updated on Aug 26 2026 12:12 AM

పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రాత్రి వేళ కాసింత విశ్రాంతి కరువవుతోంది. డ్యూటీ ముగిసిన తర్వాత కంటి నిండా నిద్రపోవడానికి విశ్రాంతి గదికి వెళ్తే.. అధికారులు కనీసం పడకలు కూడా కేటాయించకపోవడంతో నానా ఇబ్బందులూ పడుతున్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఈ దుస్థితి నెలకొంది.

రాజమహేంద్రవరం సిటీ: జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌లో రాత్రి వేళ డ్యూటీలు దిగిన డ్రైవర్లు, కండక్టర్లకు ఏర్పాటు చేసిన రెస్ట్‌ రూము నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. దీంతో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా వివిధ డిపోల నుంచి నైట్‌ హాల్ట్‌ బస్సులకు వస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని రామచంద్రపురం, అమలాపురం, రాజోలు, గోకవరం, రావులపాలెం డిపోల నుంచి రాజమహేంద్రవరానికి నైట్‌ హాల్ట్‌ బస్సులు వస్తూంటాయి. వీటి సిబ్బంది రాత్రి వేళ నిద్రించేందుకు ఇక్కడ 30 పడకలతో షెల్టర్‌ (క్రూ రెస్ట్‌ రూము) ఏర్పాటు చేశారు. అయితే, ఆయా డిపోల వారీగా పడకల కేటాయింపుతో పాటు దీని నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న నైట్‌ హాల్ట్‌ బస్సుల సిబ్బంది నానా అగచాట్లూ పడుతున్నారు.

ఇష్టానుసారం కేటాయింపు

ఈ నైట్‌ హాల్ట్‌ షెల్టర్‌లో పడకలను ఇష్టానుసారం కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోని తుని, కాకినాడ, ఏలేశ్వరం డిపోలకు సంబంధించి నైట్‌ హాల్ట్‌ బస్సులు లేకపోవడంతో వాటికి పడకలు కేటాయించలేదు.

ఫ రాజమహేంద్రవరం డిపో సిబ్బందికి ఈ షెల్టర్‌లో ఏకంగా 9 పడకలు కేటాయించడం విచిత్రం. వాస్తవానికి ఈ డిపో సిబ్బంది స్థానికంగా నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నైట్‌ హాల్ట్‌ షెల్టర్‌ ఎంతమాత్రం అవసరం లేదు. కానీ, ఆ విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు.

ఫ అమలాపురం, రాజోలు డిపోల నుంచి చెరో రెండు నైట్‌ హాల్ట్‌ బస్సులు రాజమహేంద్రవరం వస్తున్నాయి. దీని ప్రకారం ఈ డిపోలకు నాలుగేసి చొప్పున పడకలు కేటాయిస్తే చాలు. కానీ, ఒక్కో డిపోకు ఆరేసి కేటాయించారు.

ఫ గోకవరం డిపో నుంచి రెండు నైట్‌ హాల్ట్‌ బస్సులు వస్తూండగా.. వీటి సిబ్బందికి 4 పడకలు చాలు. కానీ, 5 కేటాయించారు.

ఫ రావులపాలెం డిపో నుంచి కూడా రెండు నైట్‌ హాల్ట్‌ బస్సులు రాజమహేంద్రవరం వస్తున్నాయి. ఈ బస్సులలోని సిబ్బందికి కూడా 4 పడకలు కేటాయించాలి. కానీ, ఒక్క బెడ్‌ కూడా ఇవ్వకపోవడం విచిత్రం. దీనిపై ఆ డిపో డ్రైవరు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్‌ హాల్ట్‌ బస్సులు ఎన్ని వస్తున్నాయి, ఎంత మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉంటున్నారనే అంశాన్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా బెడ్‌లు కేటాయించారని విమర్శిస్తున్నారు.

కనీస సౌకర్యాలు మృగ్యం

నైట్‌ హాల్ట్‌ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లకు ఈ షెల్టర్‌లో కనీస సౌకర్యాలు కూడా కరువవుతున్నాయి. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. అలాగే, బెడ్‌లపై దుప్పట్లు, తలగడలు కూడా లేవు. నైట్‌ షెల్టర్‌లో ఎవరు ఏవిధంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని పట్టించుకున్నవారే లేరు. అవసరం లేకపోయినా ఈ షెల్టర్‌లో ఫ్యాన్లు నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటున్నాయి. బెడ్‌లపై డ్రైవర్లు, కండక్టర్లు లేనప్పటికీ ఏ ఒక్కరూ ఫ్యాన్లు ఆఫ్‌ చేయడం లేదు. మరోవైపు స్థానిక సిబ్బంది కొందరు మధ్యాహ్న సమయంలో మద్యపాన సేవనానికి నైట్‌ షెల్టర్‌ను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేనందువల్లనే ఈ పరిస్థితి నెలకొందని డ్రైవర్‌, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించి, పరిస్థితిని చక్కదిద్దాలని, డిపోల వారీగా అవసరం మేరకు బెడ్‌లు కేటాయించాలని డ్రైవర్లు, కండక్టర్లు కోరుతున్నారు.

మా డిపోకు బెడ్‌లు కేటాయించండి సార్‌

రావులపాలెం డిపో నుంచి రెండు బస్సులు రాజమహేంద్రవరంలో నైట్‌ హాల్ట్‌ చేస్తున్నాయి. వాటి సిబ్బంది అవసరమైన 4 బెడ్‌లు కేటాయించకపోవడంతో రాత్రి వేళ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డ్యూటీ దిగిన తర్వాత విశ్రాంతి తీసుకుందామని ఖాళీగా ఉన్న బెడ్‌లపై పడుకుంటే, రాత్రి వేళ ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని నిద్ర లేపి బయటకు పొమ్మంటున్నారు. ఆపరేషన్లు జరిగాయని, కింద పడుకోవడానికి ఇబ్బందిగా ఉందని, బెడ్‌లు కేటాయించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా రావులపాలెం డిపో డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి రోజూ రెండు బెడ్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.

– నాగరాజు, డ్రైవర్‌, రావులపాలెం డిపో

డిపోల వారీగా పడకలు

ఇష్టానుసారం కేటాయించారిలా..

డిపో నైట్‌ హాల్ట్‌ బస్సులు బెడ్స్‌

రాజమహేంద్రవరం 0 9

రామచంద్రపురం 4 4

అమలాపురం 2 6

రాజోలు 2 6

గోకవరం 2 5

రావులపాలెం 2 0

ఫ ఆర్టీసీ రెస్ట్‌ రూములో

ఇష్టారాజ్యంగా పడకల కేటాయింపు

ఫ స్థానిక సిబ్బందికి అధిక సంఖ్యలో బెడ్‌లు

ఫ రావులపాలెం డిపో సిబ్బందికి

4 అవసరం

ఫ ఒక్కటీ కేటాయించని అధికారులు

ఫ రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నైట్‌ హాల్ట్‌ డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement