సాక్షి, అమలాపురం: ఆకుపచ్చని ప్రకృతి అందాలు.. కాలువల నడుమ కొబ్బరి తోటలు.. వరి చేల మధ్య పాయలు పాయలుగా జలవాహిని గలగలలు.. అరటి, వక్క, తమలపాకు, మిరియాల వంటి ఉద్యాన పంటలు.. చూడగానే ఇది కేరళా! కోనసీమా!! అనే సందేహం కలగక మానదు. ప్రకృతి సోయగాల్లో కేరళకు ఏమాత్రం తీసిపోదు మన కోనసీమ. అందుకేనేమో నాలుగు దశాబ్దాల క్రితమే ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన ఎంతో మంది మలయాళీలకు ఈ సీమ సొంతగడ్డగా మారిపోయింది. ఇప్పుడు ఆ సొంతగడ్డ పైనే వారు ఓణం సంబరాన్ని అంబరాన్నంటేలా జరుపుకోనున్నారు. నేడు తిరు ఓణం సందర్భంగా కోనసీమ అంతటా కేరళీయుల ఇళ్లలో పూల సోయగాలు విరబూయనున్నాయి.
ఇంటింటా సందడి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న మలయాళీలు కేరళ సంస్కృతిని ప్రతిబింబించేలా ఓణం పండగను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటి ముందు ‘పూక్కళం’ (పూలతో వేసే అందమైన ముగ్గు) వేస్తున్నారు. అత్తపూవు నుంచి మొదలుపెట్టి రోజురోజుకూ పూలను జోడిస్తూ తిరు ఓణం నాడు భారీ పూక్కళంగా తీర్చిదిద్దుతారు. మరో ప్రధాన ఆకర్షణ ఓన సద్య. అంటే.. అరటి ఆకులో 26 రకాలకు పైగా శాకాహార వంటకాలతో విందు భోజనం చేస్తారు. ఇది వారికి సంప్రదాయంగా వస్తోంది. సొంత గడ్డకు దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడి మలయాళీలు పండగ సంతోషాన్ని ఏమాత్రం దూరం చేసుకోవడం లేదు. అమలాపురంలోని ఓ వైద్య కళాశాలలో తకజం పేరిట విద్యార్థులు ఓణం పండగ నిర్వహించారు. వివిధ ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న మలయాళీ ఉపాధ్యాయులందరూ ఈ నెల 31న తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఓణం సంబరాలు నిర్వహించనున్నారు. అలాగే, సెప్టెంబర్ 13న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని రంగాలకు చెందిన మలయాళీలు రాజమహేంద్రవరంలో భారీగా సమావేశమై, ఓణం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఫ నేడే తిరు ఓణం
ఫ పండగ సంబరంలో కేరళీయులు
ఫ కోనసీమను సొంతగడ్డగా మార్చుకున్న
వలస జీవులు
ఫ నాలుగు దశాబ్దాలుగా విద్యారంగంలో మమేకం
మలయాళీలకు విశిష్ట పండగ ఓణం కేరళ రాష్ట్ర పండగ. ఇది మలయాళీలకు కేవలం పండగ మాత్రమే కాదు.. భావోద్వేగాలతో ముడిపడిన విశ్వాసం. పురాణాల ప్రకారం రాక్షస రాజు మహాబలి ఏటా తన ప్రజలను చూడటానికి భూలోకానికి వస్తాడన్నది కేరళీయుల నమ్మకం. ఆయనకు స్వాగతం పలికేందుకే ఓణం జరుపుకొంటారు. పది రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. చివరి రోజున జరిగే తిరు ఓణం అత్యంత ముఖ్యమైనది. దీనిని బుధవారం నిర్వహించుకుంటున్నారు.
మినీ కేరళం
కోనసీమను ‘మినీ కేరళం’ అని కూడా పిలుస్తారు. గోదావరి జిల్లాలకు మలయాళీల వలస నాలుగు దశాబ్దాల క్రితమే మొదలైంది. ఇంగ్లిష్ పాండిత్యంతో ఎంతో మంది మలయాళీ యువత ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు, బంగారం, వస్త్ర వ్యాపారాల్లోనూ వారి ప్రభావం అధికం. కొందరు మూడు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని, కోనసీమ బిడ్డలుగా మారిపోయారు.


