రావులపాలెం: దొంగతనాల నియంత్రణకు చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. రావులపాలెం టౌన్ సీఐ జి.రమేష్‌బాబు కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం మెర్లపాలేనికి చెందిన మిద్దే పార్వతి ఇంట్లో గత నెల 24న దొంగతనం జరిగింది. పార్వతి తన చిన్న కుమారుడి ఇంటికి బొబ్బిలి వెళ్లారు. అదే సమయంలో ఆమె ఇంట్లోని 60 కాసులు బంగారు, 500 గ్రాముల వెండి వస్తువులతో పాటు రూ.3 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆత్రేయపురం ఎస్సై కె.రాము కేసు నమోదు చేయగా.. సీఐ రమేష్‌బాబు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ర్యాలి గ్రామంలోని రామాలయం వద్ద ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన దాసరి మహేష్ అనే యువకుడిని మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 451.476 గ్రాముల బంగారు, 493.10 గ్రాముల వెండి వస్తువులతో పాటు రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రావులపాలెం కొత్త కాలనీ సమీపంలోని చిన్నవారిపాలెం వద్ద తాత్కాలికంగా నివా సం ఉంటున్నట్లు పోలీ సులు గుర్తించారు.


