సీతానగరం: ఇసుక మాఫియా బరితెగించింది. సీతానగరంలోని అనధికార కై లాసగిరి ర్యాపు నుంచి ఇసుక, బొండుమట్టిని ట్రాక్టర్లపై అక్రమంగా తరలించుకుపోతోంది. ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ పొందకుండా.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కై లాసగిరి రోడ్డు నుంచి అక్రమ రవాణాకు ఇసుకాసురులు తెగబడుతున్నారు. మట్టి కలిసిన నిషిద్ధ బొండు ఇసుకను ట్రాక్టర్లలో బహిరంగంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తోంది. పరిమితికి మించిన ఇసుక లోడుతో గ్రామాల్లో వేగంగా దూసుకుపోతున్న ట్రాక్టర్ల ధాటికి రోడ్డు తీవ్రంగా దెబ్బ తింటోంది. పాదచారులు, వాహనచోదకులు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అనధికార ర్యాంపును సీజ్ చేసి, ఇసుక, బొండు మట్టి అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


