వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వేణును పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయనను పలువురు కలిసి అభినందనలు తెలిపారు. చెల్లుబోయిన వేణును శాటిలైట్‌సిటీ వైఎస్సార్ సీపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. అలాగే పార్టీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ, మహిళా నేతలు కళ్యాణిరెడ్డి, సింహాద్రి రామలక్ష్మి, పట్టపగలు వెంకటలక్ష్మిలు ఆయనను అభినందించారు. పిడింగొయ్యి మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు నరవ గోపాలకృష్ణ సత్కరించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ రెండేళ్లలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అంతా కృషి చేద్దామని అన్నారు.


