కొత్త వేలుగులు | - | Sakshi
Sakshi News home page

కొత్త వేలుగులు

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

దేవరపల్లికి మహర్దశ

హైవేల కూడలిగా మారిన వైనం

ఆ గ్రామం మీదుగా మూడు

జాతీయ రహదారుల నిర్మాణం

దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు మధ్య మండల కేంద్రమైన దేవరపల్లి గతంలో ఓ సాధారణ జంక్షన్‌. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడది మూడు ప్రధాన జాతీయ రహదారుల కూడలిగా గుర్తింపు పొందింది. దీంతో దేశ వ్యాప్తంగా దేవరపల్లికి గుర్తింపు లభించింది. రవాణా పరంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు అత్యంత ప్రాధాన్యంగా మారింది. మూడు జాతీయ రహదారులు ఆ గ్రామంలో ‘వే’లుగులు విరజిమ్మతున్నాయి.

హాయిగా ప్రయాణం

తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి 25 కిలోమీటర్ల దూరంలో దేవరపల్లి ఉంది. ఎక్కడా లేని విధంగా మూడు జాతీయ రహదారులను దేవరపల్లి మీదుగా నిర్మించారు. ఒకే గ్రామం మీదుగా మూడు హైవేల నిర్మాణం జరగడం చాలా అరుదు. గతంలో కనీస రహదారుల సదుపాయం లేని దేవరపల్లి నేడు జాతీయ ప్రధాన రహదారులతో అభివృద్ధి చెందింది. పదేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని చూసిన ప్రజలు.. నేడు దేవరపల్లిని చూసి ఆశ్చర్యపోతున్నారు. రహదారులపై ప్రయాణికులు హాయిగా రయ్‌ రయ్‌ మంటూ ప్రయాణం చేస్తున్నారు.

జాతీయ రహదారులు

గుండుగొలను – కొవ్వూరు మధ్య 170 కిలో మీటర్ల నాలుగు వరుసల జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16)ని రూ.1,825 కోట్లతో నిర్మించారు. సుమారు 53 కిలో మీటర్లు బైపాస్‌ హైవే నిర్మాణం చేశారు. అలాగే దేవరపల్లి – తల్లాడ జాతీయ రహదారి (316 డి)ని సుమారు రూ. 98 కోట్లతో రెండు వరుసలుగా ఏర్పాటు చేశారు. ఇక మూడో జాతీయ రహదారి దేవరపల్లి – ఖమ్మం (365 బీజీ) గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవే. దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు పచ్చని పంట పొలాల మీదుగా రూ. 4,451 కోట్లతో 162 కిలోమీటర్లు మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేసి ఇటీవల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు ఈ రహదారి దగ్గర మార్గం అవుతుంది. ఈ మూడు ప్రధాన జాతీయ రహదారులను దేవరపల్లి శివారున అనుసంధానం చేశారు. ఈ కూడలి ప్రాంతానికి డైమండ్‌ జంక్షన్‌గా అధికారులు నామకరణం చేశారు. దీనికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో జీలుగుమిల్లి – కొవ్వూరు రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. రూ.365 కోట్ల వ్యయంతో దాదాపు 86.2 కిలో మీటర్లు దీన్ని నిర్మిస్తున్నారు. సుమారు వంద గిరిజన ప్రాంతాలు, 30 మైదాన ప్రాంతాలకు రహదారి ఉపయోగకరంగా ఉంటుంది.

మెరుగుపడిన రవాణా రంగం

మూడు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణంతో మెట్ట ప్రాంతంలో రవాణా రంగం మెరుగుపడింది. ఈ ప్రాంతంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి రైతులు గిట్టుబాటు ధర పొందుతున్నారు. హైదరాబాద్‌, చైన్నె, కోల్‌కతా, విశాఖ, ఒడిశా వంటి ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది.

పెరిగిన భూముల ధరలు

భూముల ధరలు కూడా పెరిగాయి. 2004–05లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి, కుడి, ఎడమ ప్రధాన కాలువలకు భూముల సేకరణ చేసి రైతులకు ఎకరాకు రూ. 3 లక్షలు చొప్పున పరిహారం అందజేసి న్యాయం చేశారు. అప్పటి వరకు ఎకరం ధర రూ. 40 నుంచి 50 వేలు ఉండగా, రూ. 3 లక్షలు ఇవ్వడంతో రైతులు ఆర్థికంగా కోలుకున్నారు. అనంతరం జాతీయ రహదారుల నిర్మాణం చేయడంతో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. రహదారి పక్కన భూమి ఎకరం రూ. 2 నుంచి 3 కోట్లు పలుకుతోంది. లోపల భూములు కూడా రూ. 60 నుంచి 80 లక్షలు పలకడంతో రైతులు ఆర్థికంగా పుంజుకున్నారు. రహదారుల పక్కన పరిశ్రమలు నెలకొల్పడంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement