అక్కడ ఆయన. ఇక్కడ ఈయన.. | - | Sakshi
Sakshi News home page

అక్కడ ఆయన. ఇక్కడ ఈయన..

Mar 15 2026 1:20 AM | Updated on Mar 15 2026 1:20 AM

జనసేనలో వర్గవిభేదాలు

రాజమహేంద్రవరంలో బయటపడిన వైనం

వేర్వేరుగా ఆవిర్భావ దినోత్సవ

కార్యక్రమాలు

సాక్షి, రాజమహేంద్రవరం: నగరంలో జనసేన నాయకుల మధ్య వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌ ఒక వైపు కార్యక్రమం నిర్వహించగా, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి అత్తి సత్యనారాయణ మరోవైపు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. దీనికి తోడు పార్టీలోని రాష్ట్ర స్థాయి నేతలు సిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌ కార్యక్రమానికి హాజరుకావడం దీనికి అగ్గి రాజేసినట్లయింది. అత్తి సత్యనారాయణ నగరంలో హడావుడి చేశారు. అన్ని వార్డుల్లో తిరిగి భారీ ర్యాలీ చేపట్టారు. సిటీ అధ్యక్షుడు మాత్రం తన పరిధిలో కార్యక్రమం నిర్వహించారు.

సఖ్యత లేదా!

రాజమహేంద్రవరం సిటీ జనసేనలో ఇద్దరు నేతల మధ్య ఇప్పటికే సఖ్యత ఉండటం లేదు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అత్తి సత్యనారాయణ, సిటీ ఇన్‌చార్జి వై.శ్రీనివాస్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. స్వపక్ష పార్టీ అయినా ఏ ఒక్క సందర్భంలోనూ ఇద్దరు నేతలూ కలిసిన సందర్భాలు లేవు. ఇటీవల అత్తి సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అత్తికి శుభాకాంక్షలు తెలిపేందుకు పక్క నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు హాజరైనా సిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌ మాత్రం గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రాజమహేంద్రవరంలోని తన నివాసంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ కార్యాలయంలో అత్తి సత్యనారాయణ ఒకేరోజు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో బత్తుల ఏర్పాటు చేసిన సమావేశానికి వై.శ్రీనివాస్‌ హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.

మేయర్‌ పదవి కోసమేనా?

సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే స్థానాన్ని కూటమి సర్దుబాటులో భాగంగా అత్తి సత్యనారాయణ వదుకోవాల్సి వచ్చింది. అందుకు ప్రతిఫలంగా రాజమహేంద్రవరం మేయర్‌ పీఠం అత్తినే వరిస్తుందన్న ప్రచారం విస్తృతంగా నడిచింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సైతం సత్యనారాయణకే మద్దతు ఇచ్చారు. అయితే అత్తి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన వెంటనే రాజకీయం మారిపోయింది. ఆదిరెడ్డి వాసు వై.శ్రీనును ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. అందులో భాగంగానే అత్తికి దూరమయ్యారన్న చర్చ నగరంలో జోరుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement