కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అనేక కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లాలోని 47 బెంచ్‌ల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కోర్టులో న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కక్షిదారులు తమ కేసులను సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసుల్లో లబ్ధిదారులకు పరిహారాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మోటార్ ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, లేబర్ కోర్టు కేసులు, వినియోగ దారుల కోర్టు కేసులను రాజీ ద్వారా పరిష్కారం చేసి బాఽధితులకు అవార్డులు జారీ చేశామన్నారు. 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, న్యాయమూర్తులు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


