ప్రగతిలో చెట్టాపట్టాల్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రగతిలో చెట్టాపట్టాల్‌

Mar 7 2026 8:15 AM | Updated on Mar 7 2026 8:15 AM

నిడదవోలు రైల్వే స్టేషన్‌కు కొత్త హంగులు

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో ఏర్పాటు

నూతనంగా 4, 5 ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం

రెండు లిఫ్ట్‌లు, ఎస్క్‌లేటర్ల ఏర్పాటు

నిడదవోలు: రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి కూత పెట్టింది.. చకచకా కొత్తరూపు దిద్దుకుంది.. కేంద్ర ప్రభుత్వ అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో సర్వ హంగులతో రెడీ అయ్యింది.. విజయవాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య కీలకమైన జంక్షన్‌గా పేరొందిన నిడదవోలు రైల్వే స్టేషన్‌ కొత్తరూపును సంతరించుకుంది. అమృత్‌ భారత్‌ పథకానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలో తొలి విడతగా 11 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇందులో నిడదవోలు ఒకటి. ఈ పథకం కింద రూ.28 కోట్లతో ఈ రైల్వే స్టేషన్లో అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే ఈ పనులను పూర్తి చేశారు. ఇన్నేళ్లలో ఎన్నడూ చూడని అభివృద్ధి పనులు రైల్వే అధికారులు పూర్తి చేయడంతో ప్రయాణికుల అవసరాలు తీరుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్లాట్‌ఫామ్‌లకు చేరుకోవడానికి రెండు లిఫ్ట్‌లు, ఒక ఎస్క్‌లేటర్‌ను నిర్మించారు.

చేపట్టిన పనులివీ..

నిడదవోలు రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం మూడు ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇందులో 200 మీటర్ల మేర ఫ్లోర్‌ను గ్రానైట్‌తో ఆధునీకరించారు. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ను రూ.3.91 కోట్లతో తాడేపల్లిగూడెం వైపు విస్తరించారు. దీనిని 600 మీటర్ల పొడవున కాంక్రీట్‌, గ్రానైట్‌తో నిర్మించారు. ప్లాట్‌ఫామ్‌ రక్షణ గోడ, ఇతర పనులు చేపట్టారు. ఇదే ప్లాట్‌ఫామ్‌లో రూ.3.28 కోట్లతో 600 మీటర్ల పొడవున అధునాతన షెడ్డు నిర్మించారు. రూ.6 కోట్లతో కొత్తగా 4, 5 ప్లాట్‌ఫామ్‌లు పూర్తి చేశారు. దీనివల్ల మరిన్ని రైళ్ల రాకపోకలకు వీలు కలుగుతుంది. ప్లాట్‌ఫామ్‌ల మధ్య ప్రయాణికుల రాకపోకలకు రెండు లిఫ్ట్‌లు నిర్మించారు. ఒక ఎస్క్‌లేటర్‌ కూడా నిర్మించడంతో ప్రయాణికులు ఎంతో సులువుగా ఇతర ఫ్లాట్‌ఫామ్‌లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం స్టేషన్‌లో 1, 2, 3 ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఒకే కాలిబాట వంతెన ఉంది. దీనికి అదనంగా రాజమహేంద్రవరం వైపు ఆక్సిజన్‌ పార్కు వద్ద రూ. 12 కోట్లతో 45 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఎండ్‌ టూ ఎండ్‌ ఫుట్‌పాత్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించడంతో అన్ని ప్లాట్‌ఫామ్‌లకు ప్రయాణికులు సులువుగా చేరుకుంటున్నారు. ఇదే ప్రాంతంలో రెండు లిఫ్ట్‌లు, ఒక ఎస్క్‌లేటర్‌ నిర్మాణ పనులు పూర్తి చేశారు. స్టేషన్‌లో విద్యుద్దీపాల వ్యవస్థను ఆధునీకరించారు. స్టేషన్‌ మొత్తం రూ.1.90 కోట్లతో అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించారు. ఇక్కడ మహిళలకు 8, పురుషులకు 8, దివ్యాంగులకు 2 చొప్పున మరుగుదొడ్లు నిర్మించారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన ఏసీ వెయిటింగ్‌ హాలు, సాధారణ ప్రయాణికులకు విశ్రాంతి వెయిటింగ్‌ హాలును నిర్మించారు. ప్రయాణికులు సులభంగా గుర్తించేలా రాకపోకల సంకేతాలు, పార్కింగ్‌ ప్రదేశాల మార్గాలు, వ్యర్థాల నిర్వహణ, భవన నిర్వహణ పనులు చేపట్టారు. రైళ్ల రాకపోకలు తెలుసుకోవడానికి ప్రత్యేక డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేశారు.

ఎంతో మందికి ఆసరా..

నిడదవోలు రైల్వే జంక్షన్‌ స్టేషన్‌ను 1935లో బ్రిటిష్‌ హయాంలో నిర్మించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ముఖద్వారంగా ఉండటంతో జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వంటి ప్రాంతాలతో పాటు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి ప్రయాణికులు నిడదవోలు రైల్వే స్టేషన్‌పైనే ఆధారపడతారు.

ఇక్కడి నుంచి నిత్యం వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖపట్నం – విజయవాడ మార్గంలో ఉన్న ఈ రైల్వే జంక్షన్‌ నుంచి పలు రైళ్లు భీమవరం, నర్సాపురం, గుడివాడ పట్టణాలకు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రోజు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు 3,800 మంది సుమారు 68 రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రోజుకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. ప్రతి రోజూ సుమారు 30 గూడ్స్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. నిడదవోలు పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలు గూడ్స్‌ రైళ్ల ద్వారా సరకులు రవాణా చేసుకుంటారు. ప్రధానంగా ఎఫ్‌సీఐ గోడౌన్లకు ధాన్యం నిల్వలను ఇక్కడి నుంచి తరలిస్తుంటారు. ప్రస్తుతం సి–గ్రేడ్‌లో ఉన్న ఈ రైల్వే స్టేషన్‌ ద్వారా నెలకు సుమారు రూ. కోటి ఆదాయం రైల్వే శాఖకు సమకూరుతోంది.

ముఖద్వారం.. ఆకర్షణీయం

రైల్వే స్టేషన్‌ భవనం ముఖద్వారంలో 50 మీటర్ల పొడవున నిర్మించిన ఎలివేషన్‌ ఆకట్టుకుంటోంది. దీని నిర్మాణంతో స్టేషన్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎంతో ఆకర్షణీయంగాల ఇది ఉంది. రైల్వే స్టేషన్‌ ముందు భాగంలో కర్షక కష్టం అద్దం పట్టేలా స్వాగత ద్వారం దాటిన తర్వాత స్టేషన్‌లోకి అడుగుపెట్టే సమయంలో ప్రయాణికులకు ఆహ్లాదం కలిగే విధంగా ఈ ప్రాంత వ్యవసాయ ప్రాధాన్యం తెలిపేలా రెండు ఎద్దులతో రైతు నాగలి పట్టి పొలం దున్నుతున్నట్టుగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement