నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
రెవెన్యూ క్లినిక్‌లో ఫిర్యాదులు స్వీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌తో పాటు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. భూ సమస్యల పరిష్కార వేదికపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆమె తెలిపారు. ఈ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దారులు ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఆపరేటర్, అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పని సరిగా హాజరుకావాలని ఆదేశించారు.
గోదావరి డెల్టాకు
సీలేరు జలాలు
మోతుగూడెం: గోదావరి డెల్టాకు లోయర్ సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాకు సుమారు 8 వేల క్యూసెక్కుల వరకూ నీటి అవసరం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలపడంతో, నీటి విడుదలకు ఏపీ జెన్‌కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుంచి 28 రోజుల పాటు గోదావరి జిల్లాలకు రబీ అవసరాల నిమిత్తం జలాలు విడుదల చేయనున్నారు. డొంకరాయి డ్యామ్ నుంచి 3,800 క్యూసెక్కులు, పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అనంతరం 4,200 క్యూసెక్కులు కలిపి మొత్తం 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. సుమారు రెండు నెలలు ఐదారు యూనిట్ల అనుసంధాన పనుల వల్ల నీటి విడుదల ఆలస్యం అయ్యిందని అధికారులు తెలిపారు. డొంకరాయి డ్యామ్ నుంచి దిగువలకు నీటిని విడుదల చేయడంతో సీలేరు నది ప్రవాహ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జెన్‌కో అధికారులు సూచించారు. ఈ సమాచారాన్ని చింతూరు ఐటీడీఏ, రెవెన్యూ శాఖకు తెలిపామన్నారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు లోవ దేవస్థానానికి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. క్యూలో 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు, పూజా టికెట్లు, తలనీలాలు, వసతి గదుల అద్దెలు, విరాళాల ద్వారా రూ.3,93,652 ఆదాయం లభించిందని వివరించారు.
ఏలేరు ఆయకట్టుకు
నీటి విడుదల
ఏలేశ్వరం: రబీ సాగు అవసరాల కోసం ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా ఆదివారం 83 మీటర్లుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను నీటి నిల్వలు 17.40 టీఎంసీలు ఉన్నాయి. ఆయకట్టుతో పాటు విశాఖకు 200, పంపా జలాశయానికి 25, తిమ్మరాజు చెరువుకు 20 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.


