ప్రాక్టికల్ పరీక్షలకు వేళాయె
● ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ జనరల్ విద్యార్థులకు
● ఉమ్మడి జిల్లాలో 248 కేంద్రాలు
● 43,787 మంది విద్యార్థులు సన్నద్ధం
● కార్పొరేట్ కళాశాలల్లో సన్నద్ధత తీసికట్టు
● ప్రభుత్వ కళాశాలల్లో పరికరాలు మృగ్యం
కపిలేశ్వరపురం: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఓ గొప్ప అనుభూతి. రెండేళ్ల పాటు చదువుకున్న పాఠ్యాంశాలకు ప్రయోగ రూపం ఇస్తూ తమ అవగాహన స్థాయిని పరీక్షించుకునేందుకు దోహదపడతాయి. విద్యార్థి తీసుకున్న గ్రూపు ఆధారంగా రెండు నుంచి నాలుగు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కథనం...
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఫిబ్రవరి 10వ తేదీ వరకూ జనరల్ సెకండ్ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలో 82 కేంద్రాల్లో 17,488 మంది, కాకినాడ జిల్లాలో 97 కేంద్రాల్లో 15,712 మంది, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 51 కేంద్రాల్లో 8,900 మంది, పోలవరం జిల్లాలో 18 కేంద్రాల్లో 1,687 మంది, ఉమ్మడి జిల్లా మొత్తంలో 248 కేంద్రాల్లో 43,787 మంది పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇప్పటికే ఈ నెల 27న పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 10 వరకూ అవి కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,682 మంది విద్యార్థులు, కాకినాడ జిల్లాలో 2,509 మంది, కోనసీమ జిల్లాలో 4,250 మంది, పోలవరం జిల్లాలో 706 మంది మొత్తం 9,147 మంది విద్యార్థులు ఒకేషనల్ ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులకు 50 మార్కులకు, జనరల్ విద్యార్థులకు 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ మార్కులు మొత్తం మార్కుల్లో కలవనున్న నేపథ్యంలో ప్రాధాన్యం ఉంది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వాహక అధికారులకు ఈ నెల 24న రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడలలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
హాల్ టికెట్ కోసం హైరానా పడొద్దు
పరీక్షా కేంద్రానికి చేరుకున్న ప్రతి విద్యార్థిని ప్రయోగ పరీక్షకు అనుమతించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించారు. హాల్ టికెట్ సకాలంలో దగ్గర లేకపోయినా పరీక్షకు అనుమతించాల్సి ఉంది. ప్రిన్సిపాల్ లాగిన్‌లో కానీ మనమిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 కు హాయ్ అంటూ మెస్సేజ్ పంపడం ద్వారా ఎడ్యుకేషనల్ సర్వీసులను సెర్చ్ చేస్తూ హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా హెచ్‌టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఇన్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం, స్టాంప్ లేకపోయినా పరీక్షకు అనుమతించాల్సి ఉంది.
నిర్వహణలో నియమ నిబంధనలు ఇలా..
ప్రాక్టికల్ గదిలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకటి లేదా రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ప్రయోగం చేసేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు పరీక్షా కేంద్రంలో ఉన్నది లేని కేంద్రానికి కేటాయించిన సంబంధిత అధ్యాపకుడు ముందు రోజు వెళ్లి పరిశీలించుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రోజు ఉదయం సెషన్ కేంద్రం 7.30 గంటలకు నిర్ధేశించిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఆధారంగా ప్రశ్నా పత్రాన్ని డౌన్లోడ్ చేస్తారు. మధ్యాహ్నం సెషన్‌లో 12.30కి డౌన్లోడ్ చేస్తారు. విద్యార్థులు పరీక్ష రాయడమూ, చేసిన ప్రయోగాన్ని పరిశీలించడమూ, మార్కులు వేయడమూ, వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడమూ అంతా సీసీ కెమెరాల ముందే చేయాల్సి ఉంది. పరీక్షా కేంద్రంలో సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలోని కమిటీ సభ్యులు సిద్ధంగా ఉంటారు.
కార్పొరేట్ కళాశాలలు ప్రాక్టికల్స్
నాణ్యతలో తీసికట్టు..
సహజంగా కార్పొరేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్‌కు సంబంధించి ల్యాబ్ అవర్స్ కేటాయించరన్న వాదన ఉంది. థియరీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షల్లో కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలుంటాయని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ల్యాబ్ పరికరాలు తగినన్ని సంఖ్యలో ఉండకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయడంలో వెనుకబాటులో ఉంటారనేది నాయకుల విమర్శ.
నిబంధనల మేరకు నిర్వహణ
ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలకు ప్రాధాన్యం ఉంది. వాటి నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ అనుబంధ శాఖల సహకారంతో శాసీ్త్రయంగా పరీక్షలను నిర్వహిస్తున్నాం. కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ తరగతిని నిర్వహించి అవగాహన కల్పించాం. సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– ఐ శారద, ఆర్‌ఐఓ, రాజమహేంద్రవరం
ప్రాక్టికల్ పరీక్షలకు వేళాయె


