చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు
● జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌ను అరెస్టు చేయాలి
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం
అధికార ప్రతినిధి బాలమునికుమారి
ముమ్మిడివరం: చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, జనసేన ఎమ్మెల్యే కీచక పర్వంపై కూటమి నాయకులు ఏం సమాధానం చెబుతారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి ఎస్‌ఈసీ సభ్యురాలు కాశి బాలమునికుమారి ప్రశ్నించారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి ఆ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వమే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ప్రజా ప్రతినిధులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారని, ప్రజలు ఇంకెవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. అరవ శ్రీధర్ వంటి వ్యక్తులు అసెంబ్లీలో కూర్చోవడానికి అనర్హులని, ఇది రాష్ట్రానికే సిగ్గు చేటన్నారు. మహిళా ఉద్యోగిని ఏడాదిన్నగా వేధించడం మానవత్వానికి మచ్చగా మిగిలిపోతుందన్నారు. భర్తకు విడాకులు ఇవ్వాలని బెదిరించడం మూడేళ్ల చిన్నారిని చంపుతామనడం అత్యంత దారుణమన్నారు. వాట్సప్ చాట్లు, వీడియో కాల్స్ వంటి ఆధారాలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం సాగుతోందనడానికి ఇది తార్కాణంగా నిలిచిందన్నారు. ఆడవాళ్ల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని మునికుమారి ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. భాధితురాలికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోటాడుతుందని ఆమె హెచ్చరించారు.


