భారీ సిగరెట్ల డంప్ స్వాధీనం
● విజిలెన్స్ అధికారుల దాడి
● రూ.2 కోట్ల విలువైన సరకుగా గుర్తింపు
కాకినాడ రూరల్: విజిలెన్స్ అధికారుల దాడిలో భారీ సిగరెట్ల డంప్ పట్టుబడింది. దీని విలువ రూ. 2 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని ఓ ఇంట్లో వీటిని అక్రమంగా నిల్వ ఉంచగా, దాడి చేసి పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తూరంగి పరిధిలోని జనావాసాలు తక్కువగా ఉండే ఓ లేవుట్‌లో ఓ ఇంటిని పచ్చిగోళ్ల అప్పారావు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ నాన్ బ్రాండెడ్, నాన్ డ్యూటీ పెయిడ్ సిగరెట్లను అక్రమంగా నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేయగా, 311 బాక్స్‌ల్లో 3.70 లక్షల సిగరెట్టు ప్యాకెట్లను గుర్తించారు. వీటిపై రూ.40, రూ.60, రూ.100గా ధరలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పారావు అదుపులోకి తీసుకుని సిగరెట్లు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో, ఎవరికి అమ్ముతారనే అంశాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. వీటిని ఒడిశా ప్రాంతం నుంచి తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో విజిలెన్స్ అధికారులతో పాటు రెవెన్యూ, ఇంద్రపాలెం పోలీసులు ఉన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ తాతారావు మాట్లాడుతూ తూరంగిలోని ఒక ఇంట్లో అక్రమంగా అన్ బ్రాండెడ్ సిగరెట్లు ఉన్నట్టు సమాచారం మేరకు తమ సీఐ మురళీకృష్ణ, మధుబాబు, ఏఓ, డీసీటీఓ సిబ్బందితో పాటు రెవెన్యూ, ఇతర శాఖ సహకారంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో చేసి నాన్ బ్రాండెడ్ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ.1.70 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. వీటిని ఇంద్రపాలెం పోలీసులకు అప్పగించామన్నారు.
భారీ సిగరెట్ల డంప్ స్వాధీనం


