అంబేడ్కర్‌ను విస్మరించిన చంద్రబాబు సర్కారు
మాజీ ఎంపీ భరత్‌రామ్ ఆగ్రహం
రాజమహేంద్రవరం సిటీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను చంద్రబాబు సర్కారు పూర్తిగా విస్మరిస్తుందని వైఎస్సార్ సీసీ జాతీయ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్‌లో గణతంత్ర దినోత్సవ రోజున అంబేడ్కర్ విగ్రహాన్ని కనీసం శుభ్రం చేసే చర్యలు చేపట్టలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీ సెంటర్‌లో మాజీ సీఎం జగన్ పాలనలో పార్లమెంట్ నమూనాతో అంబేడ్కర్ విగ్రహం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో కనీసం శుభ్రపరచకుండా అవమాన పరుస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఆ విగ్రహాన్ని శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అంతా స్థానికంగా నివాసం ఉంటుందని, అదేవిధంగా ఆరుగురు ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. కనీసం వీరికి పట్టింపు లేకుండా పోయిందన్నారు. అంతటి ముఖ్య కట్టడాన్ని శుభ్రం చేయకుండా దయనీయ స్థితిలో వదిలేయడం వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం అర్థం అవుతుందన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిటీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


