జటావల్లభుల శత వసంత మహోత్సవం
నిడదవోలు: స్థానిక లయన్స్ ఆడిటోరియంలో నిడదవోలు అర్చన ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం బ్రహ్మశ్రీ జటావల్లభుల జగన్నాథం శత వసంత మహోత్సవ సమర్చన సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ మాట్లాడుతూ జగన్నాథం ఇంత వయసులో కూడా నిరంతరం హైందవ ధర్మ, ఇతిహాసాలను అధ్యయనం చేస్తూ, ప్రవచనాలు చెప్పడం నిజంగా భగవత్ సంకల్పమన్నారు. ఆధ్యాత్మికతను ప్రతి ఒక్కరూ అందుకోవాలన్నారు. జగన్నాథం రచనలు, సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసి, సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం జటావల్లభుల జగన్నాథాన్ని సామవేదం షణ్ముఖశర్మ సత్కరించారు. కార్యక్రమంలో భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు, మధుర భారతి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, పద్య కళాతపస్వి డాక్టర్ ధూళిపాళ మహాదేవమని, సహస్రవధాన భాస్కరకోట వెంకట లక్ష్మీనరసింహం, అర్చన ఆధ్యాత్మిక ప్రచార వేదిక కన్వీనర్ ఐఎస్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జాహ్నవి కుటుంబానికి
పరామర్శ
పి.గన్నవరం: మండలంలోని జి.పెదపూడి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇటీవల జింక బొమ్మపై నుంచి పడి రెండో తరగతి విద్యార్థిని దివి జాహ్నవి మృతి చెందిన నేపథ్యంలో, ఆమె కుటుంబాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులు సుజాత, దుర్గావరప్రసాద్, కుటుంబ సభ్యులను వేణుగోపాలరావు ఓదార్చారు. పరామర్శించిన వారిలో సర్పంచ్ దంగేటి అన్నవరం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు అడ్డగళ్ల వెంకట సాయిరామ్, కుసుమ సుబ్బారావు, అడ్డగళ్ల శ్రీను తదితరులు ఉన్నారు.


