భాస్కరం... ప్రణమామ్యహం
● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
రథసప్తమి వేడుకలు
● కిక్కిరిసిన ప్రముఖ ఆలయాలు
పెదపూడి: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలోని సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సూర్యభగవానుడి పుట్టిన రోజైన రథసప్తమి పర్వదినం సందర్భంగా రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ కొవ్వూరి శ్రీనివాసు బాలకృష్ణారెడ్డి తదితరులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత సూర్యభగవానుడి దేవేరులైన ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ ఉత్సవమూర్తులను ఆలయం బయట ఉంచిన రథంలో ఆశీనులు గావించారు. అనంతరం అర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ రథోత్సవాన్ని ప్రారంభించారు. సూర్యనారాయణ నామస్మరణతో ఆలయ ఉత్సవ కమిటీ, గ్రామ యూత్, భక్తులు ఉత్సాహంగా రథాన్ని ముందుకు లాగారు. స్వామివారిని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే, కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి దర్శించుకున్నారు. కొంత సేపు ప్రత్యేక పూజల్లో కూర్చున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఉత్సవమూర్తుల పల్లకిని చంద్రశేఖర్‌రెడ్డి, జగ్గిరెడ్డి కొంతసేపు భుజంపై పెట్టుకుని మోశారు. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దేశంలో వైష్ణవ సంప్రదాయం గల ఆలయంగా ప్రసిద్ధి గాంచిందన్నారు. సుమారు 124 సంవత్సరాల చరిత్ర గల సూర్యదేవాలయంగా పేరొందిందన్నారు. ప్రతి ఏటా స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఉత్సవ కమిటీని అభినందించారు. వారికి ఆలయ కమిటీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు, స్థానిక యువనేత చింతా దొరబాబు ఆధ్వర్యంలో తీన్‌మార్ డప్పులు, భారీ బాణసంచాతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ పాటి సత్యనారాయణ భక్తులకు ఏర్పాట్లు చేశారు.
ఆ దివాకరుడిని ఊరూవాడా కొలిచింది.. సూర్య భగవానుడి జన్మ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య ఆలయాలకు భక్తజనం పోటెత్తింది.. రథ సప్తమి సందర్భంగా జి.మామిడాడలో రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. వాడపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భాస్కరం... ప్రణమామ్యహం
భాస్కరం... ప్రణమామ్యహం


