ఆర్థిక నేరాల అడ్డా | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక నేరాల అడ్డా

Jan 1 2026 11:22 AM | Updated on Jan 1 2026 11:22 AM

ఆర్థిక నేరాల అడ్డా

ఆర్థిక నేరాల అడ్డా

సాక్షి, రాజమహేంద్రవరం: ఆర్థిక నేరాలకు 2025లో జిల్లా అడ్డాగా మారింది. ఈ ఏడాది ఆర్థిక నేరగాళ్లు రెచ్చిపోయారు. ఆర్థిక లబ్ధికోసం హత్యలు, దోపిడీ, చైన్‌ స్నాచింగ్‌, సాధారణ దొంగతనాలు విచ్చలవిడిగా జరిగాయి. ఈ నేరాలు 2024లో 886 నమోదు కాగా.. 2025లో 928 నమోదై.. 5 శాతం పెరిగాయి. రాత్రిపూట దొంగతనాలు 17 శాతం పెరిగాయి. రహదారులు రక్తసిక్తంగా మారాయి. 14 శాతం ప్రమాదాలు అధికంగా చోటు చేసుకున్నాయి. గంజాయి, బాలికల అదృశ్యం కేసులు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లాలో 2025లో నేరాలు 15 శాతం తగ్గుముఖం పట్టాయని ఎస్సీ డి.నరసింహ కిషోర్‌ వెల్లడించారు. జాంపేటలోని పోలీస్‌ కల్యాణ మండపంలో 2025 నేర నివేదికను ఆయన బుధవారం విలేకరులకు తెలిపారు. 2024లో వివిధ నేరాలపై 7,586 కేసులు నమోదు కాగా, 2025లో 6,477 నమోదైనట్టు చెప్పారు.

రూ.3,78,42,525 కోట్లు మాత్రమే రికవరీ

రాత్రి పూట దొంగతనాలు 17 శాతం పెరగ్గా.. సాధారణ దొంగతనాలు 3 శాతం పెరిగాయి. మొత్తం 465 కేసులు నమోదు చేయగా.. రూ.4 కోట్ల మేర ఆస్తి స్వాధీనం చేసుకున్నారు. 60 మంది అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు. 2025లో వివిధ దొంగతనాల్లో రూ.7,79,82,812 కోట్లు తస్కరించగా.. కేవలం రూ.3,78,42,525 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. 4.735 కేజీల బంగారం రికవరీ చేశారు. 233 ద్విచక్ర వాహనాలు, 153 ట్రాన్స్‌ఫార్మర్లు, వాటర్‌ మోటార్లు రికవరీ చేశారు.ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల ద్వారా ప్రయాణిస్తూ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేసి రూ.40 లక్షల నగదు, 50 కాసుల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు.

రోడ్డు ప్రమాదాలు

రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా చోటు చేసుకుని రహదారులు రక్తసిక్తంగా మారాయి. మృతుల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. గతంతో పోలిస్తే..2025లో 14 శాతం రోడ్డు ప్రమాదాలు పెరగ్గా.. మృతి రేటు 12 శాతం అధికంగా నమోదైంది. 2024లో 729 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 309 మంది మృతి చెందారు.

● 2025లో 833 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 335 మంది మృతి చెందారు. జాతీయ రహదారులపై 350, రాష్ట్ర రహదారులపై 272, ఇతర రోడ్లపై 211 ప్రమాదాలు జరిగాయి.

● జిల్లాలో గతేడాది 30 బ్లాక్‌ స్పాట్లు ఉండగా.. ఈ ఏడాది 3 పెరిగి 33కు చేరాయి.

● ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన, రెడ్‌సిగ్నల్‌ జంపింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, డేంజరస్‌ డ్రైవింగ్‌, మొబైల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం, ఓవర్‌ లోడింగ్‌, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌, నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడిపిన సందర్భంలో 56,971 కేసులు నమోదు చేశారు.

● 302 ఛీటింగ్‌ కేసులు, 66 షెడ్యూల్‌ కులాలపై వేధింపుల కేసులు, 51 గంజాయి కేసులు నమోదు చేశారు. 180 మంది ముద్దాయిల నుంచి 3000.74 కేజీల గంజాయి, 65 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

బాలికల అదృశ్యం

● 2024లో 148 మంది బాలికలు అదృశ్యం కాగా.. 148 మందిని కనుగొన్నారు. 2025లో 141 మంది తప్పిపోగా.. 139 మంది ఆచూకీ లభించింది.

● 2024లో 522 పేకాట కేసులు నమోదవగా.. 2681 మంది నుంచి రూ.48,88,577 నగదు సీజ్‌ చేశారు. 2025లో 439 కేసులు నమోదవ్వగా.. 2245 మంది నుంచి రూ.44,74,295 సీజ్‌ చేశారు.

● 353 కోడి పందేల కేసులు నమోదవగా.. 1171 మంది నుంచి రూ.10,49,562 నగదు సీజ్‌ చేశారు. 793 కోళ్లు, 849 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 2025లో 249 కేసులు 920 మంది నుంచి రూ.13,49,735 నగదు స్వాధీనం చేసుకున్నారు. 413 కోళ్లు, 1054 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు.

● జిల్లాలో 843, ఇతర జిల్లాలకు చెందిన 141 రౌడీషీట్స్‌ ఓపెన్‌ చేశారు. 75 మందిని జైలుకు పంపారు.

● 136 మంది బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులపై కేసులు నమోదు చేశారు. 28 మందిని జైలుకు పంపారు.

● 21 మంది రౌడీ, బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులపై పీడీ యాక్ట్‌ అమలు చేశారు.

సై‘డర్‌ ’క్రైం

సైబర్‌ నేరగాళ్లు విజృంభించారు. పోలీసులు తేరుకొనేలోపే బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిరక్షరాస్యుల నుంచి చదువుకున్న వారు సైతం బాధితులుగా మారారు. 2025లో 71 కేసులు నమోదవగా.. రూ.1,34,58,141 కోట్లు కోల్పోయారు.

44 శాతం

సోషల్‌ మీడియా కేసులు

జిల్లాలో సోషల్‌ మీడియా కేసులు గణనీయంగా పెరిగాయి. 2024లో 36 కేసులు నమోదవగా.. 2025లో వాటి సంఖ్య 52 (44 శాత)కు పెరిగింది.

గతేడాదితో పోలిస్తే 5 శాతం పెరిగిన దోపిడీ, చైన్‌ స్నాచింగ్‌ కేసులు

17 శాతం పెరిగిన

రాత్రి పూట దొంగతనాలు

గతేడాది 886 కేసులుండగా.. ప్రస్తుతం 928కి పెరుగుదల

రహదారులు రక్తసిక్తం..

14 శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు

గతేడాది 729 జరగ్గా..

833కు పెరిగిన వైనం

2025 నేర నివేదిక వెల్లడించిన

ఎస్పీ నరసింహ కిషోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement