శభాష్ రాజు..
● సైకిల్ మెకానిక్ నిజాయితీ
● రూ.50 వేలున్న పర్సు పోలీసులకు అందజేత
జగ్గంపేట: ఒక సైకిల్ మెకానిక్ తనకు దొరికిన పర్సును పోలీసులకు అందజేశాడు. దానిలో రూ.50 వేలు ఉన్నా తీసుకోకుండా తన నిజాయితీని నిరూపించుకున్నాడు. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేటకు చెందిన సైకిల్ మెకానిక్ కడారి రాజు మంగళవారం రాత్రి స్థానిక జేవీఆర్ సెంటర్ మీదుగా వెళుతుండగా ఒక పర్సు దొరికింది. దాన్ని పరిశీలించగా అందులో రూ.50 వేలు, ఏటీఎం, గుర్తింపు కార్డులు ఉన్నాయి. వెంటనే దాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రఘునాథరావుకు అందజేశాడు. పర్సులోని గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ పర్సు.. బోర్వెల్ రాంబాబుదిగా గుర్తించి ఆయనకు సమాచారం అందించారు. రాంబాబు పోలీస్ స్టేషన్‌కు రావడంతో సైకిల్ మెకానిక్ సమక్షంలోనే ఆయనకు నగదు, పర్సు అందజేశారు. నిజాయితీగా పర్సు అందజేసిన రాజును ఎస్సై రఘునాథరావు శాలువా కప్పి సత్కరించారు. సీసీ పుటేజీ కూడా కూడా పరిశీలించి పర్సు యజమాని రాంబాబుగా నిర్ధారణ చేసుకున్నామని ఎస్సై వివరించారు.


