లైంగిక దాడి ఘటనలో నిందితుడి మృతిపై విచారణ
తుని రూరల్: బాలికపై అత్యాచారయత్నం ఘటనలో నిందితుడు తాటిక నారాయణరావు మృతిపై బుధవారం పెద్దాపురం ఆర్డీఓ, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కె.రమణి మేజిస్ట్రేల్ విచారణ నిర్వహించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య అధికారులతో పాటు నారాయణరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాలు, కుటుంబ సభ్యుల వాదనలను నివేదికగా ఉన్నత అధికారులకు సమర్పించనున్నట్టు ఆమె తెలిపారు. కాగా.. బాలికపై లైంగిక దాడి నేరారోపణపై తాటిక నారాయణరావును తుని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి పది గంటలకు తునిలో జడ్జి ముందు హాజరుపర్చేందుకు పోలీసులు తీసుకువెళుతుండగా మార్గం మధ్యలో కోమటి చెరువు వద్ద బహిర్భూమి కోసమని నారాయణరావు వాహనం దిగాడు. ఆ తర్వాత కనిపించలేదు. దీంతో రాత్రంతా వెతికిన పోలీసులు.. మరునాడు గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా నారాయణరావు మృతదేహం లభించింది.


