కోటసత్తెమ్మ తిరునాళ్లు వైభవంగా ప్రారంభం
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో తిరునాళ్లు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ దంపతులు ఉదయం కలశ స్థాపన చేసి, ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకాలు, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, నిర్వహించారు. ఉదయం చండీ పారాయణ, సాయంత్రం హోమం చేసినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. అమ్మవారికి ప్రధానార్చకుడు అప్పారావుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేడు మెగా పీటీఎం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్ – టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,570 పాఠశాలల్లో ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 93,399 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 1,44,355 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, ఎస్‌ఎంసీ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.


