ప్రశ్నలు వేసి.. సామర్థ్యం పరీక్షించి..
రాయవరం: దేశ భవిష్యత్తు తరగతి నాలుగు గోడల మధ్య తీర్చిదిద్దబడుతుంది. విద్యార్థుల భవిష్యత్తును పాఠశాల విద్య నిర్ణయిస్తుంది. పాఠశాలలో తరగతి వారీగా విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలను తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్యారెంటెడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ సర్వే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చురుగ్గా సాగుతోంది. పాఠశాల విద్యలో పునాది అభ్యసనం మెరుగు పర్చేందుకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్)ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు గత నెల 24 నుంచి సర్వే చేపట్టారు. దీని ఫలితాల ఆధారంగా వంద రోజుల ప్రణాళికను అమలు చేయనున్నారు.
3,224 పాఠశాలల్లో..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోని 61 మండలాల పరిధిలో 263 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 3,224 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 1,03,641 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదు తరగతి వరకూ చదువుతున్నారు. విద్యార్థుల్లో అభ్యసనా ఫలితాలు (లెర్నింగ్ అవుట్ కమ్స్) ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవడమే ఈ సర్వే లక్ష్యం.
చేస్తున్నారిలా..
ప్రధానంగా తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థతో పాటుగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రైౖవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఛాత్రోపాధ్యాయులు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సంబంధిత కాంప్లెక్స్ సీఆర్‌ఎంటీలు ఛాత్రోపాధ్యాయులకు సర్వేలో మార్గదర్శకత్వం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు ఈ సర్వేను మానిటరింగ్ చేస్తున్నారు.
వేర్వేరు ప్రశ్నలు
సర్వేలో భాగంగా విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అసెస్మెంట్ చేసే సమయంలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు ఇన్వాల్వ్ కాకుండా సర్వే చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి వేర్వేరు ప్రశ్నలు ఉంటున్నాయి. తెలుగులో చిత్రాలు, అక్షరాలు, పదాల గుర్తింపు, పేరాగ్రాఫ్ చదవడం వంటి ప్రశ్నల ఆధారంగా పరీక్షిస్తున్నారు. అలాగే గణితంలో చతుర్విద ప్రక్రియల మీద ప్రశ్నలు ఉంటున్నాయి. ఒకటి, రెండు తరగతులకు 35, అలాగే 3,4,5 తరగతులకు 42 ప్రశ్నల వంతున వేసి సమాధానాలను లీప్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సర్వే అనంతరం విద్యార్థుల అభ్యసనా ఫలితాల మేరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేసే అవకాశముంది. రాష్ట్రస్థాయిలో ఎస్‌సీఈఆర్‌టీ సర్వేను పర్యవేక్షిస్తోంది.
సామర్థ్యాలు తెలుసుకునేందుకు..
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల లెర్నింగ్ అవుట్ కమ్స్ (అభ్యసనా సామర్థ్యాలు) తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నాం. దీని ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి యాక్షన్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుంది.
– జి.నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టరు, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
ఉమ్మడి జిల్లాలో ఎఫ్‌ఎల్‌ఎన్ సర్వే
ఒకటి నుంచి ఐదో తరగతి
విద్యార్థులకు ప్రశ్నలు
అభ్యసనా సామర్థ్యం పరిశీలన
వెనుకబడిన వారి గుర్తింపునకు చర్యలు
జిల్లాల వారీగా వివరాలు
జిల్లా స్కూల్ కాంప్లెక్స్‌లు పాఠశాలలు విద్యార్థులు
కోనసీమ 87 1,377 30,881
తూర్పుగోదావరి 75 813 30,490
కాకినాడ 101 1,034 42,270


